పోలవరం ప్రాజక్టును ఎప్పుడు పూర్తి చేస్తారు?: Sailajath

ABN , First Publish Date - 2022-02-26T17:51:59+05:30 IST

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజక్ట్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు.

పోలవరం ప్రాజక్టును ఎప్పుడు పూర్తి చేస్తారు?: Sailajath

అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజక్ట్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటులో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా మోదీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, అంశాలలో మాట తప్పారన్నారు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్, 2014–15 ఆర్థిక సంవత్సరపు నిధుల లోటు భర్తీ, వెనుకబడిన  ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ఇలా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు.


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే 90 శాతం నిధులు అంటే దాదాపు రూ.50 వేల కోట్లను కేంద్రమే భరించాలన్నారు. కనీసం  సాధారణ రాష్ట్రాలకు ఇచ్చే విధంగానూ ఇవ్వకుండా, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చే విధంగానూ ఇవ్వలేదని మండిపడ్డారు. చట్టం ప్రకారం 100 శాతాన్ని తానే భరించాల్సిన పోలవరం ఖర్చులో కేవలం రూ.20,398 కోట్లు మాత్రమే భరిస్తామని ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎప్పుడో 2018లో పూర్తి కావాల్సిన పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు.  హోదా కోసం పోరాడలేక జగన్ రెడ్డి  చతికలపడ్డారని శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-02-26T17:51:59+05:30 IST