Assam Floods : ప్రజలకు సాయపడండి : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-05-20T22:00:04+05:30 IST

అస్సాంలో వరద బీభత్సం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న

Assam Floods : ప్రజలకు సాయపడండి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : అస్సాంలో వరద బీభత్సం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాధ్యమైనంతగా సాయపడాలని కాంగ్రెస్ (Congress) నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం పిలుపునిచ్చారు. లక్షలాది మంది ప్రజలు ఈ వరదల వల్ల సమస్యల్లో చిక్కుకున్నారని శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


అస్సాం (Assam) రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 7,17,046 మంది వరద ప్రభావానికి గురయ్యారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం 1,413 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నాగావ్ జిల్లా చాలా తీవ్రంగా దెబ్బతింది. ఈ జిల్లాలో 2.88 లక్షల మంది బాధితులయ్యారు. కచ్చార్ జిల్లాలో 1.2 లక్షల మంది, హోజాయ్ జిల్లాలో 1.07 లక్షల మంది ప్రభావితులయ్యారు. నాగావ్ జిల్లాలోని కామ్‌పూర్-కథియటలి రోడ్డు వరదల్లో కొట్టుకుపోయింది. 


వరద సహాయక కార్యకలాపాల్లో అస్సాం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత సైన్యం (Indian Army) పాల్గొంటున్నాయి. ఇదిలావుండగా, సిల్చార్-గువాహటి మధ్య అత్యవసర విమాన సేవలను ప్రారంభించాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. దిమా హసావో-బారక్ లోయ మధ్య కొండచరియలు విరిగిపడి, రవాణా సదుపాయాలకు ఆటంకాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కచ్చార్ జిల్లాలో విద్యా సంస్థలను, సాధారణ ప్రైవేటు సంస్థలను 48 గంటలపాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. 


Updated Date - 2022-05-20T22:00:04+05:30 IST