LICని కారుచౌకగా అమ్మేస్తున్నారు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-05-06T01:58:44+05:30 IST

జీవిత బీమా సంస్థ (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఓపెన్

LICని కారుచౌకగా అమ్మేస్తున్నారు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఓపెన్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అతి పెద్ద బీమా సంస్థ విలువను అతి తక్కువగా లెక్కగట్టారని, కారుచౌకగా అమ్మేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. 


రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ఎల్ఐసీ 13.94 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్నారని, రూ.39 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, షేర్ హోల్డర్లకు పెట్టుబడులపై రాబడిని ఇవ్వడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ సంస్థ విలువను అతి తక్కువగా అంచనా వేసిందని ఆరోపించారు. భారత దేశపు అత్యంత విలువైన సంపదల్లో ఒకటైన ఎల్ఐసీని అంత కారుచౌకగా ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. 


LIC IPO మే 4న ఓపెన్ అయింది. ఇది మన దేశంలో అతి పెద్ద ఆఫర్. రిటెయిల్, సంస్థాగత మదుపరులు దీనిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఆఫర్ మే 9న ముగుస్తుంది. ఒక్కొక్క ఈక్విటీ షేర్‌కు రూ.902-949 ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులు, పాలసీ హోల్డర్లకు రిజర్వేషన్ కల్పించింది. రిటెయిల్ ఇన్వెస్టర్లు, ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఒక్కొక్క ఈక్విటీ షేర్‌కు రూ.45 చొప్పున, పాలసీ హోల్డర్స్ రూ.60 చొప్పున  డిస్కౌంట్ పొందవచ్చునని తెలిపింది. ఎల్ఐసీలో తనకుగల 3.5 శాతం వాటాను అమ్మేసి రూ.21,000 ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 


ఈ షేర్లకు నిర్ణయించిన ధరలపై కాంగ్రెస్ గత మంగళవారం ప్రశ్నలను లేవనెత్తింది. 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లను పణంగా పెట్టి కారుచౌకగా ఈ ధరలను నిర్ణయించారని ఆరోపించింది. 



Read more