నరకం బాట పడతాం : చిదంబరం హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-21T20:04:40+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం గురువారం బీజేపీపై

నరకం బాట పడతాం : చిదంబరం హెచ్చరిక

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం గురువారం బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. న్యూఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణల తొలగింపు కోసం అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన నియమాలు కుప్పకూలుతుండటాన్ని మనం ప్రతి రోజూ చూస్తున్నామని, త్వరలోనే చట్టాలు, నిబంధనలు లేని రోజులు వస్తాయని, అప్పుడు నరకం బాట పడతామని  హెచ్చరించారు. 


ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ (ఎంసీడీ) బుధవారం జహంగీర్‌పురిలోని కొన్ని చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ ఆదేశాలు మేయర్‌కు అందిన తర్వాత కూడా తొలగింపును కొనసాగించడంపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 


హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన శోభాయాత్రపై ఈ ప్రాంతంలోనే కొందరు దుండగులు దాడి చేశారు. ఈ కేసులో సుమారు 25 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 


ఈ నేపథ్యంలో చిదంబరం గురువారం ఇచ్చిన ట్వీట్లలో, శాసన నియమాలు కుప్పకూలిపోతుండటం మనం ప్రతి రోజూ చూస్తున్నామని చెప్పారు. త్వరలోనే చట్టాలు, నిబంధనలు లేని రోజులు వస్తాయన్నారు. ఒకసారి శాసనాన్ని నిరంకుశ ఆదేశాలు తొక్కుకుంటూ పోతే, ఇక మనం నరకం బాటలో పడతాం అని హెచ్చరించారు. బుల్డోజర్ అంటే నిరంకుశ ‘ఆర్డర్’ అని తెలిపారు. శాసనానికి ప్రతీక సుప్రీంకోర్టు అని చెప్పారు. శాసనాన్ని బుల్డోజర్ ధిక్కరించడం నిన్న (బుధవారం) మనం చూశామన్నారు. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దామన్నారు.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం స్పందిస్తూ, హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో బుల్డోజర్లను వాడటమంటే, భారత రాజ్యాంగ విలువలను కూల్చేయడమేనని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వం పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందన్నారు. 


Updated Date - 2022-04-21T20:04:40+05:30 IST