Congress Mla Jaggareddy: పిడుగు లాంటి ప్రకటన చేయబోతున్నారా?

ABN , First Publish Date - 2022-08-03T23:46:16+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్ కాక రేపుతుండగా..మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా..

Congress Mla Jaggareddy: పిడుగు లాంటి ప్రకటన చేయబోతున్నారా?

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal reddy) ఎపిసోడ్ కాక రేపుతుండగా..మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy Mla Jaggareddy) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం వార్తల్లో ఉండే జగ్గారెడ్డి.. కొన్ని రోజులుగా సైలెంట్‎గా ఉంటున్నారు. గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడటం లేదట. 


రాహుల్‌ను కలిసిన తర్వాత మారిపోయిన జగ్గారెడ్డి

ఢిల్లీలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సమావేశం తర్వాత జగ్గారెడ్డి కంప్లీట్‌గా తన వర్కింగ్ స్టైల్ చేంజ్ చేశారు. పార్టీ విషయాలు మీడియా ముందు మాట్లాడనని అధినేతకు చెప్పిన నేపథ్యంలో చాలా రోజుల వరకు దాన్ని పాటించారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వీహెచ్ (Vh) వెళ్లి కలవడం, పార్టీ గీత దాటిన వారిని గోడకేసి కొడతామన్న రేవంత్ రెడ్డి (Revanthreddy) కామెంట్స్‌తో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్‌కు మద్దతుగా పీసీసీ చీఫ్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. మరుసటిరోజే సంచలన ప్రకటన చేస్తానని చెప్పిన ఆయన.. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మళ్లీ బహిరంగంగా మాట్లాడనని చెప్పారు. 


కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా జగ్గారెడ్డి

అప్పటి నుంచి జగ్గారెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.  ఇటీవల మానిక్కం ఠాగూర్ (Manickam Takur), సీఎల్పీ మీటింగ్‌కు ఆయన అటెండ్ అవ్వలేదు. సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన రోజు హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ ముందు చేసిన ధర్నాలో పాల్గొనకుండా ...జగ్గన్న సంగారెడ్డిలో నిరసన దీక్ష చేశారు. తాను చెప్పినట్లుగానే గాంధీభవన్‌ (Gandhi Bhavan)కు, పీసీసీ ప్రోగ్రాంలకు దూరంగా ఉంటూ, తన బర్త్‌డే సందర్భంగా, బోనాల పండగ రోజు సంగారెడ్డిలో సందడి చేశారు. తాజాగా  రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ పార్టీ ఎమ్మెల్యేలతో రాకుండా.. ఆఖరి నిమిషంలో ఒంటరిగా వచ్చి ఓటేసి వెళ్లిపోయారు.  


దసరా వేడుకల్లో జగ్గారెడ్డి కీలక ప్రకటన

జగ్గారెడ్డి తీరుపై ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ జోరందుకుంది. ఏం చేయబోతున్నారు?. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట మేరకే ఆయన సైలెంట్‌గా ఉంటున్నారని చెబుతున్నారు. దసరా వరకు జగ్గారెడ్డి ఇలాగే మౌనంగా ఉంటారని, దసరా వేడుకల్లో తన మనసులో మాట చెబుతారని, కీలక నిర్ణయం ప్రకటిస్తారని లీకులు ఇస్తున్నారు. ఇక లక్ష మందితో సభ పెడతానని ఆయన గతంలో ప్రకటించారు. ఆ భారీ బహిరంగ సభను డిసెంబర్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ సభలో జగ్గారెడ్డి తన ఎజెండా వివరించి కీలక ప్రసంగం చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సభలో జగ్గారెడ్డి.. ఏం ప్రకటన చేస్తారు? ఏదైనా పిడుగు లాంటి మాట చెబుతారా? అనేది కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.



Updated Date - 2022-08-03T23:46:16+05:30 IST