ధరలపై కాంగ్రెస్‌ పోరు బాట

ABN , First Publish Date - 2022-08-06T08:21:24+05:30 IST

దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.

ధరలపై కాంగ్రెస్‌ పోరు బాట

  • శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
  • హైదరాబాద్‌లో చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం
  • మోదీ దుర్మార్గాలను చూస్తూ ఊరుకోవద్దు
  • కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉద్యమించాలి: భట్టి
  • భారీ వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైనా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు  ఇందిరా పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుతో పాటు వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు కాంగ్రెస్‌ నేతలు ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశాన్ని పాలించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి, అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇంధనం, నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.  


అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకోవడానికి కారణం కాంగ్రెసే అన్న విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు. మోదీ దుర్మార్గాలను చూస్తూ ఊరుకుంటే అంతకన్నా తప్పు మరోటి ఉండదని, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వరదలతో రాష్ట్రం అల్లకల్లోంగా ఉంటే కేసీఆర్‌ ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేం లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.  ప్రజల కన్నీళ్లు తుడిచే పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ధరలు పెరిగి పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఽభూపాలపల్లి కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  శ్రీధర్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకొనే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీజీపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను గద్దెదించాలని జీవన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-08-06T08:21:24+05:30 IST