కాంగ్రెస్ చరిత్రకారుడు

ABN , First Publish Date - 2022-07-29T06:01:07+05:30 IST

మేధావి, సంస్థా నిర్వహణదక్షుడు, ఉత్తమ దేశభక్తుడు, సాంఘిక పునర్నిర్మాణ కాంక్షాశీలి, సృజనాత్మక ప్రతిభాశాలి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880–1959)...

కాంగ్రెస్ చరిత్రకారుడు

మేధావి, సంస్థా నిర్వహణదక్షుడు, ఉత్తమ దేశభక్తుడు, సాంఘిక పునర్నిర్మాణ కాంక్షాశీలి, సృజనాత్మక ప్రతిభాశాలి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880–1959). ఆధునిక వైద్యవిద్య నభ్యసించిన తెలుగువారిలో ఆయన మొదటి తరం వారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సైద్ధాంతిక భూమికను నిర్మించిన రాజనీతిజ్ఞుడు.


స్వాతంత్ర్యోద్యమ మహానాయకులు తమ వ్యక్తిత్వాలతోనేకాదు, రచనా వ్యాసంగాలతో కూడా దేశ ప్రజలను ఉత్తేజపరిచారు. జాతి సమస్యలు, వాటి పరిష్కారాల పట్ల అవగాహన కల్పించారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తన ‘కరెంట్ హిస్టరీ ఇన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్’ (సమకాలిక చరిత్ర– ప్రశ్నోత్తరీయం) అనే పుస్తకంలో స్వీయ రచనా కృషి గురించి ఇలా వివరించారు: ‘‘ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నా మొదటి పుస్తకం రాయాల్సి వచ్చింది. ఆ పుస్తకం జాతీయ విద్యను గురించినది. ఎందుకంటే అప్పట్లో మేము ఒక జాతీయ విద్యా సంస్థను స్థాపించాము. జాతీయ కార్యక్రమానికి ప్రజలలో ప్రోత్సాహం కలిగించటానికి వాళ్లను ఈ విషయంలో విద్యావంతులను చేయటానికి పూనుకోవాల్సి వచ్చింది. అది 1912వ సంవత్సరం. ఆ సంవత్సరంలో దేశంలో ఒక వివాదం తలెత్తింది. అది జాతీయ వాదానికి సంబంధించింది. జాతీయవాదం బలపడడానికి పూర్వరంగం ఎలా ఉండాలి, ఏ పరిస్థితులు దానికి దోహదం చేస్తాయి మొదలైన చర్చల గురించి ఆ వివాదం తలెత్తింది. ఆ నేపథ్యంలో నేను భారత జాతీయతను గురించి ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. భారత జాతీయత సంపూర్ణంగా నెలకొనాలంటే దేశంలోని ఆయా ప్రాంతాల స్వతంత్ర సత్తాక ప్రతిపత్తి ఉండాలి. ప్రాంతీయ స్వేచ్ఛ కావాలంటే వాటికొక సమైక్య స్వరూపం ఉండాలి. ఆ సమైక్య స్వరూపం సాధించాలంటే ఒకే భాష మాతృభాష అయిన ప్రజలంతా ఒక రాష్ట్రంగా అభివృద్ధి సాధించాలి. కాబట్టి భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం అవసరం. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం గురించిన చర్చ 1916 నాటికి చాలా తీవ్ర స్థాయిలో కొనసాగుతుండేది. దీనికి ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ హార్డింజ్ 1911లో బెంగాలు నుంచి బిహార్‌ను వేరుచేయవలసిన ఆవశ్యకతను ఒక తీర్మాన రూపంలో జారీ చేసినప్పటి నుంచి ఈ చర్చా వివాదం వేడెక్కింది. అందువల్ల 1916లో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి నేను ఒక చిన్న పుస్తకం ప్రకటించాను. అందులోని వివిధ ప్రాంతాలు భాషాప్రయుక్త ప్రాతిపదికన పునః నిర్మాణావశ్యకత గురించి చెప్పాను.


1919 నుంచి 1931 వరకు నాలోని రచనా శక్తులను ప్రారంభించిన ఒక ఇంగ్లీషు వారపత్రికలోని శీర్షికలు, వ్యాఖ్యానాల ద్వారా వినియోగించుకున్నాను. ఒక్క చేతి మీదుగా 11 సంవత్సరాల పాటు ఆగిపోకుండా దీనిని నిర్వహించాను ఇక అప్పుడు 1930 నుంచి 1934 వరకు కారాగారవాసం ప్రాప్తించింది. జైల్లో ఉన్న కాలంలో కొన్ని పుస్తకాలు రాయడానికి కావలసిన సమాచారం సేకరించాను. ప్రపంచ దేశాల రాజ్యాంగాలకు సంబంధించింది ఆ సమాచారం. దీనితో పాటు ‘భారతదేశంపై సాగిన ఆర్థిక పరమైన దోపిడీ’ ‘గాంధీయిజం–సోషలిజం’, ‘హిందూ గృహ పునరావిష్కరణ’ మొదలైనవి. ఇవి 1936–37 మధ్య ప్రచురితమైనాయి. ఇంతలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ స్వర్ణోత్సవం సమీపించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక గ్రంథం తేవాలన్న కుతూహలం తొందరించింది. ముందుగా ఎటువంటి సన్నాహం లేకుండానే ఈ గ్రంథరచన చేశాను. ఇదే ‘హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్’ (కాంగ్రెస్ చరిత్ర). ఇది 1936లో ప్రచురణ పొందింది. ఈ పుస్తక రచనను 1935 మే 1న మొదలు పెట్టి జూన్ 29న ముగించాను. కాబట్టి ఈ గ్రంథం రాయడానికి నాకు ఒక నెల పైన ఇరవై తొమ్మిది రోజులు పట్టిందన్నమాట. చాల వరకు విషయమంతా పదిలంగా ఉన్న నా మనసు పుటల నుంచీ జ్ఞాపక శక్తి నుంచీ ఆవిష్కరించాను. కానీ కొంతలో కొంత అప్పుడప్పుడు ఇతరత్ర సేకరణ కూడా ఉపకరించింది. అదేమంటే అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు వివిధ ప్రాంతాలలో జరిగినప్పుడు నేను సేకరించిన పత్రాలు మొదలైనవి 20 సంవత్సరాలుగా ఒక పెద్ద కవరులో భద్రపరుస్తూ వచ్చాను. ఆ సమాచారం కూడా నాకు కొంతవరకు తోడ్పడింది. ఒక వైపు ఖాళీగా ఉండే రాత కాగితాలైనా, ఒక వైపు అచ్చు ఉండి దాని వెనుకవైపు ఖాళీ ఉండేకాగితాలైనా నేను కాంగ్రెస్ చరిత్ర రాతప్రతికి వినియోగించుకున్నాను. వీటికి తోడు కవర్లు చించినప్పుడు లోపల లభించే ఖాళీ ప్రదేశం, వార్తాపత్రికల పైన వచ్చే చుట్టు కాగితాలు (రేపర్లు) కూడా ఈ రాతప్రతిలో ఉపయోగించుకున్నాను. అది అటు తర్వాత ఇతర ప్రచురణలకు దోహదం చేసింది. 1937లో ‘గాంధీ–గాంధీయిజం’ అనే పుస్తకం రాయాల్సిందిగా నన్ను ఒకరు కోరారు. 1946లో ‘ఫెదర్స్ అండ్ స్టోన్స్’ (ఈకలు–రాళ్ళు) అనే పుస్తకం ప్రకటించాను. దీనితో పాటు ‘కాంగ్రెస్‌కే ఓటెందుకు వెయ్యాలి?’, ‘అరవై ఏళ్ళ కాంగ్రెస్’, ‘భారతదేశ రాజకీయ సమస్యలు–కొన్ని ప్రాథమిక విషయాలు’ అనే గ్రంథాలు కూడా నావి ప్రచురితమైనాయి. 1947లో ‘భారత జాతీయ కాంగ్రెస్’ రెండో సంపుటం వచ్చింది.

Updated Date - 2022-07-29T06:01:07+05:30 IST