పూర్వ వైభవం సాధించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది : శశి థరూర్

ABN , First Publish Date - 2022-03-13T23:55:23+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని మళ్ళీ సాధించే సత్తా ఉందని

పూర్వ వైభవం సాధించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది : శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని మళ్ళీ సాధించే సత్తా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీల్లో అత్యంత విశ్వసనీయతగల పార్టీగా నేటికీ నిలబడుతోందని పేర్కొన్నారు. ఈ ఆశావాదానికి మద్దతుగా దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యలతో ఓ ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు. 


‘‘జాతీయ ప్రతిపక్ష పార్టీల్లో అత్యంత విశ్వసనీయతగల పార్టీగా కాంగ్రెస్ నేటికీ నిలబడటానికి కారణం ఇదే. చక్కదిద్దుకుని, పూర్వ వైభవం పొందడానికి సత్తా ఉన్న పార్టీ కావడానికి ఇదే కారణం’’ అని తెలిపారు. 


దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలకుగల ఎమ్మెల్యేల సంఖ్యలతో ఓ పట్టికను ఇచ్చారు. బీజేపీకి 1,443 మంది; కాంగ్రెస్‌కు 753 మంది, టీఎంసీకి 236 మంది, ఆమ్ ఆద్మీ పార్టీకి 156 మంది, వైకాపాకు 151 మంది, డీఎంకేకు 139 మంది, బీజేడీకి 114 మంది, టీఆర్ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షునిగా ముకుల్ వాస్నిక్‌ను నియమించాలని కొందరు నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత వివేక్ తన్‌ఖా ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, కాంగ్రెస్ పార్టీలో ప్రతిభావంతులు ఉన్నారని, ప్రజలకు చేరువలో పార్టీ ఉందని, అయితే ఇప్పుడు ఉమ్మడి కృషి అవసరమని చెప్పారు. ‘మనం ఉమ్మడిగా పని చేద్దాం, మనం ఆ పని చేయగలం’ అని పేర్కొన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ 2020 ఆగస్టులో ఆ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసిన 23 మంది నేతల్లో వివేక్ కూడా ఉన్నారు. 




Updated Date - 2022-03-13T23:55:23+05:30 IST