వచ్చే జూన్‌కల్లా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-27T08:46:57+05:30 IST

రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, జూన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుందని..

వచ్చే జూన్‌కల్లా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

అగ్నిపథ్‌ రద్దుకు నేడు నిరసన దీక్షలు: రేవంత్‌

కాంగ్రె్‌సలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌ 

రేవంత్‌ సమక్షంలో వివిధ పార్టీల నేతల చేరిక

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం: రేవంత్‌రెడ్డి.. కాంగ్రె్‌సలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌ 

భట్టి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మంచిర్యాల టీఆర్‌ఎస్‌ నేతలు 


హైదరాబాద్‌, ఖానాపురం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, జూన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాగానీ.. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించి ఆమెకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బీజేపీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్‌.. రేవంత్‌ సమక్షలో కాంగ్రె్‌సలో చేరారు. ఆయనతో పాటుగా బీఎస్సీ నేత రావి శ్రీనివాస్‌, మెట్పల్లి జెడ్పీటీసీ రాధశ్రీనివా్‌సరెడ్డి, కోరుట్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కళ్లెం శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివా్‌సరెడ్డి తదితరులూ రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో మహిళా మంత్రే లేదని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడినీ అర్థాంతరంగా తొలగించారని పేర్కొన్నారు. బోడ జనార్థన్‌ మాట్లాడుతూ బీజేపీలో బీసీలు, దళితులకు న్యాయంం జరగడంలేదని, ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలూ ఎక్కువని అన్నారు.  కాగా, కుత్బుల్లా పూర్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆదివారం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రె్‌సలో చేరారు. రేవంత్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 500 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు ఆదివారం  సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సమక్షంలో పార్టీలో చేరారు.  


తుంగతుర్తి చేరికల పంచాయితీ..! 

తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత వడ్డేపల్లి రవి ఆదివారం కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్‌ పార్టీ నేత అయిన వడ్డేపల్లి రవి.. 2018లో తుంగతుర్తి టిక్కెట్టును ఆశించి దక్కక పోవడంతో రెబల్‌గా పోటీ చేశారు. దీంతో ఆయన్ను పార్టీ సస్పెండ్‌ చేసింది. తదనంతరం టీఆర్‌ఎ్‌సలో చేరిన ఆయన.. తాజాగా కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అయితే వడ్డేపల్లి రవిని కాంగ్రె్‌సలో చేర్చుకునే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌.. అధిష్ఠానానికి గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా కోమటిరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రె్‌సలో చేరడంతో వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రవి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లగా.. ఆయన్ను కలిసేందుకు రేవంత్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. 


అగ్నిపథ్‌ను ఆర్మీ వ్యతిరేకిస్తోంది: నాజర్‌ హుస్సేన్‌ 

 అగ్నిపథ్‌ పథకాన్ని ప్రతిపక్షాలే కాకుండా ఆర్మీ కల్నల్‌లు, జవాన్లూ వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్‌ హుస్సేన్‌ అన్నారు. అగ్నిపథ్‌లో సవరణలు చేయడం కాదని, ఆ పథకాన్నే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అగ్నిపథ్‌, అగ్నివీర్‌ పథకాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సత్యాగ్రహ నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకంపై సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. 


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌కు ఏడాది 

టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలాన్ని రేవంత్‌రెడ్డి పూర్తి చేసుకున్నారు. పార్టీలో విస్తృత సంప్రదింపులు నిర్వహించి గతేడాది జూన్‌ 26న టీపీసీసీకి అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆయన ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్‌గా నియమితుడైన తర్వాత.. పార్టీలో అసమ్మతిని ఎదుర్కొన్న రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానం సహకారంతో అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీని ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్లే యత్నాల్లో ఉన్నారు.  ప్రస్తుతం బూత్‌ స్థాయి నుంచీ టీపీసీసీ కార్యవర్గం స్థాయి వరకూ నిర్మాణ ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తయితే 2023 ఎన్నికలను ఎదుర్కొనే రేవంత్‌ టీమ్‌ పూర్తిస్థాయిలో ఏర్పడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-06-27T08:46:57+05:30 IST