రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట

ABN , First Publish Date - 2022-08-07T05:12:31+05:30 IST

ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ధర్నాలు నిర్వహించిన ఆపార్టీ నేతలు శుక్రవారం సాయంత్రం నుంచి ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రైతాంగం సమస్యలపై మెరుపు ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పోరుబాట
ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న కాంగ్రెస్‌ నేతలు

-పంట నష్టపరిహారంపై పెరుగుతున్న ఒత్తిడి

-ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు

-9నుంచి మూడురోజుల పాటు పాదయాత్ర 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ధర్నాలు నిర్వహించిన ఆపార్టీ నేతలు శుక్రవారం సాయంత్రం నుంచి ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రైతాంగం సమస్యలపై మెరుపు ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల9నుంచి మూడురోజులపాటు జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో 75కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నారు. ముఖ్యం గా ఇటీవలి భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండుతో శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆ పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజా సమస్యలే ఆలంబనగా కాంగ్రెస్‌ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండడంతో అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా వర్షాలు సంభవించి రైతాంగం 70వేల ఎకరాల్లో పత్తి, కంది, తదితర పంటలను నష్టపోయింది. వరుసగా మూడో ఏడాది కూడా ప్రకృతికన్నెర్ర చేయడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న విషయాన్ని గమనించి కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి ఈ మెరుపు నిరాహార దీక్షకు దిగినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం కనీసం సర్వే చేయలేదన్న ఆరోపణలు రైతన్నల నుంచి విమర్శిస్తున్న తరుణంలో అన్వేష్‌ రెడ్డి బృందం ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంటనష్టాన్ని పరిశీలించింది. ఈ క్రమంలోనే రైతాంగం పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్దేశ్యంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నట్టు ఆయన చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండీ కాంగ్రెస్‌ పార్టీ నేతలు జిల్లాలోనే రెండు నియోజకవర్గాల్లో దూకుడు పెంచడంతో అధికార పార్టీ నేతలపై ఒత్తిడి స్పష్టంగా కన్పిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధా నంగా పంట నష్ట పరిహారం వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ నాయ కత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు పెరుగుతుండ డంతో అటు ఎమ్మెల్యేలు, ఇటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఇబ్బం దికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు వాటినే ఆయుధాలుగా మలుచుకొని ఆందోళనలు చేపడు తుండడంతో ప్రజల మద్దతు కొల్పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవు తోందని అధికారపార్టీ నేతలు వ్యాఖ్యాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇటీవల మంత్రి కిరణ్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించినప్పటికీ అది మొక్కుబడి సమీక్షే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ అధికార పక్షంపై తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు చెబుతున్నారు. 

9నుంచి పాదయాత్ర

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నాయకులు ఆసిఫాబాద్‌, సిర్పూరు(టి) శాసనసభ నియోజక వర్గాల్లో ఈనెల9నుంచి 12వరకు పాదయాత్ర నిర్వహించను న్నారు. సిర్పూరు(టి)నుంచి ప్రారంభించి పెద్దబండ, చింతకుంట, గన్నారం మీదుగా బెంగాళీ క్యాంపు, కాగజ్‌నగర్‌, వంకులం, నవేగాం, కైరిగాం, ఆసిఫాబాద్‌ వరకు 75కిలోమీటర్ల మేర పాద యాత్ర  కొనసాగించనున్నారు. దారిపొడవునా రైతులు ఎదుర్కొం టున్న సమస్యలు పంట, ఇండ్లు నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటారు. పాదయాత్ర సందర్భంగా తమ దృష్టికి వచ్చే అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా అదిష్టానానికి నివేదికలను ఇవ్వనున్నారు. పాదయాత్ర సంద ర్భంగా రెండు నియోజకవర్గాల్లోనూ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యకర్తలను ఇందులో పాల్గొనేలా ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేసినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-08-07T05:12:31+05:30 IST