కాంగ్రెస్‌ హయాంలో పేదలకు భూములు పంచాం: భట్టి

ABN , First Publish Date - 2022-03-15T01:46:08+05:30 IST

కాంగ్రెస్‌ హయాంలో పేదలకు పంచిన భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ హయాంలో పేదలకు భూములు పంచాం: భట్టి

భూదాన్‌పోచంపల్లి: కాంగ్రెస్‌ హయాంలో పేదలకు పంచిన భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షీ నటరాజన్‌ నేతృత్వంలో యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌ వరకు చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్రను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే ఆశయ సాధనకు, సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు సర్వోదయ సంకల్ప పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ నేతృత్వంలో గరీబీ హఠావో నినాదంతో పేదలకు భూమి ని పంపిణీ చేశారని, 1952లో భూ సంస్కరణల చట్టం అమలు చేశారని గుర్తుచేశారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు భూములు పంచితే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసైన్డ్‌ భూములను పేదలకు దక్కకుండా పెద్దలకు దోచిపెట్టే కుట్ర చేస్తోందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేడు పేదలకు భూములు దక్కకుండా చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు.


Updated Date - 2022-03-15T01:46:08+05:30 IST