‘దండోరా’కు సిద్ధం

ABN , First Publish Date - 2021-09-17T04:37:19+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దు గ్రామమైన ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలుకుని ప్రజ్ఞాపూర్‌ మీదుగా గజ్వేల్‌ సభాస్థలి వరకు హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలతో నింపేశారు. సభ కోసం గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీ మైదానం ముస్తాబైంది.

‘దండోరా’కు సిద్ధం
ముస్తాబైన గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీ మైదానం

కాంగ్రెస్‌ సభకు గజ్వేల్‌ ఐవోసీ మైదానం ముస్తాబు

మూడు స్టేజీలు, 30 వేల కుర్చీలతో ఏర్పాట్లు

పాత పరిచయాలతో అన్నీ తానై చూసుకుంటున్న గీతారెడ్డి

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలపై దృష్టి సారించిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర

సభ ఏర్పాట్లపై ఆరా తీసిన టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి

ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క

దళితులు, గిరిజనుల పట్ల వ్యతిరేకతపై ప్రభుత్వాన్ని ఎండగడతాం : గీతారెడ్డి



గజ్వేల్‌, సెప్టెంబరు 16 : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దు గ్రామమైన ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలుకుని ప్రజ్ఞాపూర్‌ మీదుగా గజ్వేల్‌ సభాస్థలి వరకు హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలతో నింపేశారు. సభ కోసం గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీ మైదానం ముస్తాబైంది. సభాస్థలిలో గత సమావేశాలకు భిన్నంగా మూడు స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో వీవీఐపీలకు, కుడి వైపున ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల కోసం వేదికను, ఎడమ వైపున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేదికలను ఏర్పాటు చేశారు. సభా వేదికలకు మూడు రంగుల జెండాను ఏర్పాటు చేశారు. ఎర్రకుంట వైపుగా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా స్థలి వెనుకాల వీవీఐపీ, వీఐపీలకు పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. సభాస్థలి ఎదుట ప్రజలు కూర్చునేందుకు 30 వేల వరకు కుర్చీలను వేస్తున్నారు. ఈ సభాస్థలిలోనే గతంలో సీఎం కేసీఆర్‌ 2018 సాధారణ ఎన్నికల సభను ఏర్పాటు చేశారు. 


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ 

సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభను ఏలాగైనా విజయవంతం చేయాలన్న సంకల్పంతో నాయకులు పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ జనసమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికాబద్దంగా ముందుకు కదులుతున్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి తనకున్న పాత పరిచయాలతో జనసమీకరణపై ఫోకస్‌ పెట్టగా, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలపై దృష్టి కేద్రీరకరించారు. ఇక దుబ్బాక, నర్సాపూర్‌, అందోల్‌, మెదక్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి నుంచి జనాన్ని భారీగా సమీకరించనున్నారు. ఏలాగైనా లక్ష మందిని తరలించాలన్న సంకల్పంతో కాంగ్రెస్‌ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉండగా సభా ఏర్పాట్ల గూర్చి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, సీతక్కతో మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేశారు. 


రెండుసార్లు గజ్వేల్‌ ప్రజలు ఓటేస్తే ఏం చేశారు : గీతారెడ్డి

గజ్వేల్‌ ప్రజలు రెండుసార్లు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి గీతారెడ్డి ప్రశ్నించారు. తాను మంత్రిగా 400 కేవీ సబ్‌స్టేషన్‌, కర్కపట్ల, కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లిలో పరిశ్రమలను తీసుకువచ్చానని, గజ్వేల్‌లో పార్కును ఏర్పాటు చేశానన్నారు. కానీ కేసీఆర్‌ దేనికో ఆశపడి ప్రాజెక్టులు తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. దళితబంధు మోసమని, ఓట్ల కొనుగోలు కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎలక్షన్‌ కమిషన్‌ ఏం చేస్తున్నదో తెలియడం లేదన్నారు. దళితులు, గిరిజనుల పట్ల చూపిస్తున్న వ్యతిరేకతపై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. చిన్నారిపై హత్యాచారం జరిగితే ఇప్పటికీ టీఆర్‌ఎ్‌సలోని ఒక్క నాయకుడు వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓడిదుడుకులు సహజమన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ ద్రోహులున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ విమర్శించారు. కేసీఆర్‌ మోసకారి అని, పిట్టల దొర అని ఎద్దేవా చేశారు. లక్షకుపైగా జనసమీకరణ చేసి గజ్వేల్‌లో చరిత్రలో ఈ సభను నిలుపుతామన్నారు. దళితుల మనోభావాలతో కేసీఆర్‌ ఆటలాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి మాట మర్చిపోయిన సీఎం మంత్రివర్గంలో ముగ్గురు ఎస్సీలకు చోటివ్వాల్సి ఉండగా, ఒక్కరితోనే కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు పథకాన్ని మూడు ఎకరాల భూ పంపిణీ హామీని తుంగలో తొక్కడానికే తీసుకొచ్చారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కేసీఆర్‌ చేతుల మీదుగా అందించిన వారికి ఖాతాల్లో డబ్బు వేసి కేవలం రూ.10 వేలు తీసుకునే వీలు కల్పించి రూ.9.90 లక్షలను ఫ్రీజ్‌ చేశారని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్దరణకు ప్రజలంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి సభతో మొదలైన ఈ దండోరా సభలు గజ్వేల్‌లో ముగియనున్నాయని చెప్పారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ ఆరితేరారన్నారు. దళితులకు ఈ నెలాఖరులోగా రూ.10 లక్షలు, మూడెకరాల భూమి, డబుల్‌ ఇళ్లను అందించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 265 భూసంస్కరణలు తీసుకువచ్చి నిరుపేదలకు భూములిస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆ భూములను లాక్కుంటున్నదని సీతక్క ఆరోపించారు. ఈ సభకు ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. వారివెంట వేం నరేందర్‌రెడ్డి, భవాని తదితరులున్నారు. 



Updated Date - 2021-09-17T04:37:19+05:30 IST