ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా కాంగ్రెస్‌ పోటీ

ABN , First Publish Date - 2021-11-27T05:02:01+05:30 IST

ఉనికిని చాటేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శుక్రవారం పటాన్‌చెరులో నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా కాంగ్రెస్‌ పోటీ

స్థానికసంస్థల బలోపేతానికి రూ.500 కోట్లు కేటాయించాం

కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌

అధికారం కోసం చీకటి పొత్తులు

వైద్యుడిగా 30 ఏళ్లుగా ప్రజాసేవలో డాక్టర్‌ యాదవరెడ్డి

ఆయన గెలుపు లాంఛనమే

రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


పటాన్‌చెరు, నవంబరు 26: ఉనికిని చాటేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శుక్రవారం పటాన్‌చెరులో నిర్వహించారు. స్థానిక సంస్థల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,072 ఓట్లు ఉంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి 777 సభ్యుల మద్దతు ఉందన్నారు. అత్తెసరు ఓట్లు ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టడం హాస్యాస్పదమన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు స్థానిక సంస్థలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఎలాంటి నిధులు లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దేనని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ స్థానిక సంస్థల కోసం చేసింది శూన్యమన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏకంగా రూ.500 కోట్లను కేటాయించిందన్నారు. మున్సిపాలిటీలకు నేరుగా ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. 30 ఏళ్లుగా వైద్యవృత్తితో ప్రజలతో మమేకమైన తెలంగాణ బిడ్డ డాక్టర్‌ యాదవరెడ్డిని పెద్దల సభకు పంపిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.  ఆయన ఎన్నిక లాంఛనమే అయినా ఒక్క ఓటు కూడా వృథా కాకుండా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజా సమస్యలు పట్టవన్నారు. పటాన్‌చెరులో త్వరలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ యాదవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. ప్రజా ప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి మరింత మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదవరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కార్పొరేటర్‌ పుష్పనగేష్‌, సింధుఆదర్శరెడ్డి, జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి, గంగుల సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, ఎంపీపీలు సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, ప్రవీన, ఈర్ల దేవానంద్‌, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T05:02:01+05:30 IST