దుబ్బాకలో కాంగ్రెస్‌ పోటీ!

ABN , First Publish Date - 2020-08-15T09:37:49+05:30 IST

దుబ్బాక నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

దుబ్బాకలో కాంగ్రెస్‌ పోటీ!

కార్యకకర్తలు సమాయత్తం కావాలి

కరోనా మరణాలను ప్రభుత్వం దాస్తోంది: ఉత్తమ్‌ 

కాంగ్రె్‌సలో చేరిన టీజేఎస్‌ నేత భవానీరెడ్డి


హైదరాబాద్‌/మధిర టౌన్‌/సైదాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇది టీపీసీసీ నిర్ణయమని, దీనిపై ఎవరేం మాట్లాడినా.. అది వారి వ్యక్తిగతమేనని స్పష్టం చేశారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి సూచించారు. శుక్రవారం టీజేఎస్‌ నేత భవానీరెడ్డి ఉత్తమ్‌ సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీజేఎస్‌ తరఫున సిద్దిపేట నుంచి భవానీరెడ్డి పోటీ చేశారని, విద్యావంతురాలైన ఆమెను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు.


రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడంలేదని, వీటిపై తాము కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కరోనా మరణాలను దాస్తున్నారని, తాము మృతుల వివరాలను బయట పెడతామని, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.


దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు?

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్న దానిపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డి.. అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నర్సింహారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. అయితే సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. టీజేఎస్‌ నేత భవానీరెడ్డి శుక్రవారం కాంగ్రె్‌సలో చేరడంతో ఆమె అభ్యర్థిత్వాన్నీ పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-08-15T09:37:49+05:30 IST