Nav Sankalp Chintan Shivir: ప్రజలకు Congress దూరమైంది: Rahul ఒప్పుకోలు

ABN , First Publish Date - 2022-05-16T00:48:44+05:30 IST

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరమైందనే విషయాన్ని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అంగీకరించారు. ప్రజలతో కాంగ్రెస్‌కు...

Nav Sankalp Chintan Shivir: ప్రజలకు Congress దూరమైంది: Rahul ఒప్పుకోలు

ఉదయ్‌పూర్: ప్రజలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) దూరమైందనే విషయాన్ని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (R ahul Gandhi) అంగీకరించారు. ప్రజలతో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయని, వాటిని పునరుద్ధరించి, తిరిగి పటిష్టం చేసేందుకు అక్టోబర్‌లో ఒక యాత్రను నిర్వహించనున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల 'నవ సంకల్ప్ చింతన్ శివిర్' (Nav Sankalp Chintan Shivir) ముగింపు కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ, ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధన ప్రాధాన్యతను వివరించారు.


పార్టీ ఆర్గనైజేషన్‌లో విస్తృత సంస్కరణలతో కూడిన రోడ్ మ్యాప్‌ను (నవ్ సంకల్ప్)ను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ఆమోదించింది. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఫార్ములా ఇందులో ఒకటి. కుటుంబంలో మరో వ్యక్తి టిక్కెట్ ఆశిస్తే అతను కనీసం ఐదేళ్ల పాటు పార్టీకి అసాధారణ సేవలు అతని అందించి ఉండాలి. వీటిపై రాహుల్ గాంధీ మరింత వివరణ ఇస్తూ, ప్రజలతో కాంగ్రెస్ సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే విషయాన్ని మనం అంగీకరించాల్సి ఉంటుందని, సిద్ధాంతాలతోనే తమ పోరు అని అన్నారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి వారితో కూర్చుని, పార్టీకి-ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక యాత్ర నిర్వహించాలని నిర్ణయించిందని, ప్రజలతో సంబంధాల పునరుద్ధరణకు దగ్గర దారులంటూ ఉండవని, నేరుగానే వారితో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు. నవ సంకల్ప్ చింతన్ శివిర్‌లో అంతా మనసు విప్పి చర్చించడంపై రాహుల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహా చర్చలు ఏ పార్టీలోనూ సాధ్యం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ''కచ్చితంగా ఇలాంటి చర్చలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అనుమతించవు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది'' అని అన్నారు.


రాష్ట్రాల సమాహారమే కేంద్రమని రాహుల్ పునరుద్ధాటించారు. దేశంలోని వివిధ సంస్థలను ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం చేస్తున్నారని పరోక్షంగా కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏ రోజైతే దేశంలోని సంస్థలు పనిచేయడం మానేస్తాయో ఆరోజే మనం తీవ్రమైన చిక్కుల్లో పడతామని చెప్పారు. ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాహుల్ అన్నారు.

Updated Date - 2022-05-16T00:48:44+05:30 IST