దేశంలో విధ్వంసకర విద్వేషం వ్యాపించింది : సోనియా గాంధీ

ABN , First Publish Date - 2022-04-16T23:16:19+05:30 IST

దేశంలో విద్వేషం, మత ఛాందసత్వం, అసహనం నిండిపోయాయని

దేశంలో విధ్వంసకర విద్వేషం వ్యాపించింది : సోనియా గాంధీ

న్యూఢిల్లీ : దేశంలో విద్వేషం, మత ఛాందసత్వం, అసహనం నిండిపోయాయని, వీటిని ఆపకపోతే, సమాజం మరమ్మతు చేయడానికి వీల్లేనంతగా నష్టపోతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఆమె రాసిన వ్యాసంలో ఈ హెచ్చరిక చేశారు. 


‘‘నేడు మన దేశంలో విధ్వంసకర విద్వేషం, మత ఛాందసత్వం, అసహనం, అసత్యం నిండిపోయాయి. మనం ఇప్పుడు దీనిని ఆపకపోతే, ఇది ఇప్పటికే నష్టం చేసి ఉండకపోతే, మరమ్మతు చేయడానికి వీల్లేని రీతిలో మన సమాజాన్ని నష్టపరుస్తుంది. దీనిని మనం కొనసాగనివ్వకూడదు. బూటకపు జాతీయవాద బలిపీఠంపై శాంతి, బహుతావాదం బలైపోతూ ఉంటే, ప్రజలుగా మనం గుడ్లు అప్పగించి చూస్తూ ఉండకూడదు’’ అని సోనియా గాంధీ రాశారు. 


గతంలో అనేక తరాలవారు ఎంతో శ్రమతో నిర్మించినదానిని నేల కూల్చడానికి ముందే, ఎగసిపడుతున్న ఈ జ్వాలలను, విద్వేషపు సునామీని అదుపు చేయాలన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘గీతాంజలి’లోని వాక్యాలు నేటి పరిస్థితులకు గొప్ప సంబంధం కలవని, మారుమోగేవని చెప్పారు. 


‘‘ఓ శతాబ్దం క్రితం, భారత జాతీయవాద కవి ప్రపంచానికి అమరత్వంగల ‘గీతాంజలి’ని ఇచ్చారు. దీనిలోని బహుశా 35వ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. గురుదేవులు ఠాగూర్ ప్రార్థన, తదుపరి పరిణామాలను బలంగా ప్రభావితం చేసే వాక్యాలతో ఇలా ప్రారంభమవుతుంది... ‘మనసు ఎక్కడ భయం లేకుండా ఉంటుందో...’. ఈ ప్రార్థన నేటి పరిస్థితుల్లో చాలా సంబంధంగలది, మారుమోగుతుంది’’ అని పేర్కొన్నారు. 


ఓ వైరస్ ఉగ్రరూపం దాల్చిందని చెప్తూ, భారత దేశం శాశ్వతంగా ఓ వైపు కేంద్రీకృత పరిస్థితిలో ఉండిపోవాలా? అని ప్రశ్నించారు. ఇటువంటి వాతావరణం తమ మేలు కోసమేనని భారతీయులు విశ్వసించాలని అధికార పక్షం స్పష్టంగా కోరుకుంటోందన్నారు. దుస్తులు, ఆహారం, మత విశ్వాసాలు, పండుగలు, భాష వంటివేవైనా సరే, భారతీయులను భారతీయులపైకి ఉసిగొలపాలని ప్రయత్నిస్తున్నారన్నారు. జగడాలకు పాల్పడే శక్తులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం లభిస్తోందన్నారు. ప్రతికూల, శత్రుత్వ,  ప్రతీకార భావాలను ప్రోత్సహించేవిధంగా ప్రాచీన, సమకాలిక చరిత్రను చెప్తుండటం కొనసాగుతోందన్నారు. 


భారత దేశ వైవిద్ధ్యం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా చెప్తున్నప్పటికీ, కఠోర వాస్తవం మరోలా ఉందని తెలిపారు. అనేక శతాబ్దాలపాటు నిర్వచించిన, సమాజాన్ని పరిపుష్టం చేసిన సుసంపన్న వైవిద్ధ్యాన్ని ప్రస్తుత పరిపాలనలో మనల్ని విభజించడానికి, కఠినంగా మారడానికి, మరింత బలంగా పాతుకుపోవడానికి తారుమారు చేస్తుండటం మరింత దయనీయమని ఆరోపించారు. 


మన సమాజం సహకారాత్మక, సమ్మిళిత సంప్రదాయాలతో కూడినదని, విద్వేష బృంద గానం, దాపరికం లేకుండా శత్రుత్వ భావనలను పురిగొలపడం, మైనారిటీలపై నేరాలు పెరుగుతున్నాయంటే, అటువంటి సమాజం నుంచి దూరమవుతున్నట్లేనని తెలిపారు. 


Updated Date - 2022-04-16T23:16:19+05:30 IST