కరోనాతో కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-12T18:29:12+05:30 IST

కరోనాకు మరో నేత బలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..

కరోనాతో కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూత

  • నెల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరిక
  • స్టాలిన్‌, ఈపీఎస్‌, ఓపీఎస్‌ సంతాపం
  • ఆయన గెలిస్తే మళ్లీ ఉప ఎన్నికే: ఈసీ


చెన్నై : కరోనాకు మరో నేత బలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవరావ ఆదివారం ఉదయం కన్ను మూశారు. గత మాసంలో నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన.. ఆ మరునాడే అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత రెండు రోజులు ప్రచారం ‘మమ’ అనిపించినా ఇక కోలుకోలేకపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు వయస్సు 63 సంవత్సరాలు. రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సర్వసభ్యమండలి సభ్యుడిగా ఉన్న మాధవరావు గత మార్చి 15న శ్రీవిల్లిపుత్తూరులో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు. మరుసటి రోజే ఆయన అస్వస్థతకు గురయ్యారు. అయినా రెండు రోజులపాటు ప్రచారం చేశారు. మూడో రోజు ప్రచారం చేస్తున్నప్పుడు శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం మదురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 


వైద్యపరీక్షలు జరిపినప్పుడు మాధవరావుకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత వైద్యనిపుణులు ఆయనకు చికిత్సలందిస్తూ వచ్చారు. అదే సమయంలో మాధవరావు తరఫున ఆయన కుమార్తె దివ్య ప్రచార బాధ్యతలు చేపట్టారు. దివ్య ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో తండ్రికి బదులుగా ఆమెనే అభ్యర్థిగా కాంగ్రెస్‌ నిలబెడుతుందని ఊహాగానాలు చెలరేగాయి. అదే సమయంలో మదురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మాధవరావుకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. శ్వాసకోశ సమస్యలు కూడా అధికమయ్యాయి. ఈ పరిస్థితుల్ల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు మాధవరావు మృతి చెందారు. మాధవరావు చెన్నైలోనే యేళ్ళతరబడి నివసిస్తున్నారు. ఆయన స్వస్థలం శ్రీవిల్లిపుత్తూరు. 1986 నుంచి ఆయన కాంగ్రెస్‌పార్టీకి సేవలందిస్తున్నారు. చెన్నై లాకాలేజీలో రాజీవ్‌గాంధీ ఫోరమ్‌ అధ్యక్షుడిగా, భారత జాతీయ విద్యార్థి సంఘం సభ్యుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా, ఏఐసీసీ సమన్వయకమిటీ సలహాదారుగా పలు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం ప్రజలందరికీ ఆయన సుపరిచితులు. ఆ కారణంగానే కాంగ్రెస్‌ అధిష్ఠానం మాధవరావును అభ్యర్థిగా ఎంపిక చేసింది. మే రెండున కౌంటింగ్‌ జరుగనున్న నేపథ్యంలో మాధవ రావు మృతి చెందటం పట్ల కాంగ్రెస్‌ నేతలంతా తీవ్ర దిగ్ర్భాంతి చెందారు.


స్టాలిన్‌ సంతాపం

శ్రీవిల్లిపుత్తూరు కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు మృతిపట్ల డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. కరోనా వైరస్‌ తాకిడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవరావు మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని, ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టాల్సిన తరుణంలో ఆయన మృతి కాంగ్రెస్‌ పార్టీకి, నియోజకవర్గం ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఇకపై ప్రజాసేవకులందరూ తప్పనిసరిగా కరోనా నిరోధక టీకాలు వేసుకోవాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఇదేవిధంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి కూడా మాధవరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు.


మాధవరావు గెలిస్తే ఉప ఎన్నిక తథ్యం : ఈసీ

శాసనసభ ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరు కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు గెలిస్తే ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. మే రెండున అన్ని నియోజక వర్గాలల్లో ఓట్ల లెక్కింపు జరుగనుండటంతో మాధవరావు మృతి కారణంగా శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం ఎన్నికలను రద్దు చేసే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలతోపాటు శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం లో పోలైన ఓట్లను కూడా మే రెండున లెక్కించి ఫలితాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-04-12T18:29:12+05:30 IST