స్వాతంత్య్రం తెచ్చింది... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-08-09T05:40:00+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

స్వాతంత్య్రం తెచ్చింది... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌
ఇల్లందకుంటలో వీఆర్‌ఏలకు సంఘీభావం తెలుపుతున్న పొన్నం ప్రభాకర్‌

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదు

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

ఇల్లందకుంట, ఆగస్టు 8: దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 150 కిలోమీటర్ల మేరకు మంగళవారం నుంచి 18 వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రను నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ తరం యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. అధిక ధరలతో పేద ప్రజలు, అధిక పెట్టుబడితో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌ అంటూ హైద్రాబాద్‌లో తిరుగుతున్నాడని, ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని డిమాండ్‌ చేశారు. ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని, ఒకప్పుడు ఉప ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం బీజేపీ తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజీనామాలు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ బారి నుంచి కాపాడుకోవడానికి ఈటల రాజేందర్‌ బీజేపీకి వెళ్లడం జరిగిందని, సిద్ధాంతాల గురించి మాట్లాడే హక్కు ఈటల రాజేందర్‌కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మండల క్రేందంలో వీఆర్‌ఏల దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, నాయకుడు పత్తి కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సాయిని రవి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రామారావు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్‌, నాయకులు సారంగపాణి, పైడిపల్లి అయోధ్య, రామకృష్ణ, సంపత్‌, రాము, రవి, సలీం, శ్రీనివాస్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:40:00+05:30 IST