నేటి నుంచే కాంగ్రెస్‌ మేధోమథనం

ABN , First Publish Date - 2022-05-13T08:48:47+05:30 IST

ఎనిమిదేళ్లుగా వరుస పరాజయాలు.. సీనియర్‌ నేతలు, కార్యకర్తల వలసలతో బక్కచిక్కిన కాంగ్రెస్‌ పార్టీ..

నేటి నుంచే కాంగ్రెస్‌ మేధోమథనం

ఉదయ్‌పూర్‌లో 3 రోజులు ‘చింతన్‌ శిబిర్‌’

పార్టీ సంస్థాగత ప్రక్షాళనే లక్ష్యం

పొత్తులు, ఎన్నికల సవాళ్లపై నేతల చర్చ

కొత్త రూపు, నూతన దిశానిర్దేశం!

ఆరు కీలక అంశాలకు ప్రాధాన్యం

చర్చలతో రోడ్‌మ్యాప్‌కు రూపకల్పన

వర్కింగ్‌ కమిటీలో ఖరారు


న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లుగా వరుస పరాజయాలు.. సీనియర్‌ నేతలు, కార్యకర్తల వలసలతో బక్కచిక్కిన కాంగ్రెస్‌ పార్టీ.. సంస్థాగత ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. పార్టీకి కొత్త రూపు తెచ్చి.. కార్యకర్తలకు నూతన దిశానిర్దేశం చేసేందుకు శుక్రవారం నుంచి ‘చింతన్‌ శిబిర్‌’నిర్వహించనుంది.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడ్రోజులపాటు జరిగే ఈ మేధోమథన సదస్సులో దాదాపు 450 మంది సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల సవాళ్లు, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వ్యత్యాసాలు, దళితులు, మైనారిటీలపై దాడులు, హిందూ, ముస్లింల మధ్య విభేదాలను రెచ్చగొట్టడం, సరిహద్దుల్లో చైనా దురాక్రమణ మొదలైన అంశాలపై లోతుగా చర్చించి.. ప్రధాన ప్రతిపక్షంగా వీటిపై ఏ విధంగా ఉద్యమించాలో ఖరారు చేస్తారు. అంతర్గత సవాళ్లు, ఎన్నికల పరాజయాలను అధిగమించి.. నిర్దిష్ట కాలవ్యవధిలో పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మించి.. ఎలా బలోపేతం చేయాలి.. కీలకమైన ఎన్నికల పొత్తులు తదితర అంశాలపై నాయకత్వం దృష్టి సారించనుంది. ఎన్నికలకు ముందు ప్రజలతో పార్టీ నేతలు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకునేందుకు తీసుకోవలసిన చర్యలు, అవలంబించాల్సిన వ్యూహాలను కూడా శిబిర్‌లో చర్చిస్తారు. గతంలోనూ ఇలాంటి చింతన్‌ శిబిర్‌లు నిర్వహించారని..

పెద్దగా సాధించిందేమీ లేదని విమర్శలు వస్తుండడంతో.. ఉదయపూర్‌ శిబిర్‌ను మొక్కుబడిగా జరపరాదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ వారంలో జరిగిన వర్కింగ్‌ కమిటీ భేటీలో పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ప్రధానంగా ఆరు అంశాలు.. రాజకీయాలు, సామాజిక న్యాయం-సాధికారికత, సంస్థాగత వ్యవహారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులు-రైతు కూలీలు, యువతకు సంబంధించి చర్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆరు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా అంశాలపై అవి నిర్మొహమాటంగా, అరమరికలు లేకుండా చర్చిస్తాయి. తర్వాత పార్టీకి రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తారు. దీనిపై వర్కింగ్‌ కమిటీ చర్చించి ఖరారు చేస్తుంది. ఈ రోడ్‌ మ్యాప్‌ కేవలం పార్టీ పునరుజ్జీవానికే గాక.. మొత్తం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా గురువారం ఢిల్లీలో స్పష్టం చేశారు.

సమస్యలపై కాంగ్రెస్‌ పోరాట విధానాన్ని శిబిర్‌లో నిర్ణయిస్తామని చెప్పారు. మూఢనమ్మకాలు, బుల్డోజర్‌ మతోన్మాదం, అన్యాయం, అసహనం, విభజన రాజకీయాలతో భారత దేశ ఉనికిని దెబ్బతీస్తున్న మోదీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడమే తమ లక్ష్యమని తెలిపారు. సమావేశం తర్వాత పార్టీ కొత్త రూపంతో ప్రజలకు ముందుకొస్తుందన్నారు. ఈ దఫా చర్చల్లో ఆత్మ విమర్శకు అధిక సమయం కేటాయిస్తారని.. దాని ఆధారంగా సంస్థాగత లోపాలను సరిదిద్దుకునే మార్గాలను కూడా అన్వేషిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్న దానిపైనా ఈ చర్చల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. 


రాహులే పగ్గాలు చేపట్టాలి..

నాయకత్వ సమస్యపై చింతన్‌ శిబిర్‌లో చర్చించే అవకాశాల్లేవని కాం గ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్‌ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు నేతలు కోరే వీలుందని పేర్కొన్నాయి. కాగా, కాంగ్రె్‌స-ముక్త్‌ భారత్‌ సాధ్యం కాదని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చెప్పారు. అలా కోరుకునేవారే క్షీణించిపోతారన్నారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌, పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌సింగ్‌ త్యాగాలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌ విలువల ఆధారంగానే దేశం నడిచిందన్నారు. 

Read more