న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కొత్త బాధ్యతలు అప్పగించింది. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకునిగా (అబ్జర్వర్) ఆయనను శనివారంనాడు నియమించింది. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్టు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. భూపేష్ బఘెల్ ఈ విషయాన్ని ఏ ట్వీట్‌లో తెలియజేస్తూ, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనను యూపీ అబ్జర్వర్‌గా నియమించారని, ఇది చాలా పెద్ద బాధ్యత అని అన్నారు. అధిష్ఠానం అంచనాలకు అనుగుణంగా తాను చేయగలిగినదంతా చేస్తానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహరచన చేస్తోంది. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పట్టుదలగా ఉంది. ప్రియాంక వాద్రా సారథ్యంలో ఈసారి ఎన్నికలకు వెళ్లేందుకు పార్టీ క్యాడర్‌ను సమయాత్తం చేస్తోంది.