న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మధ్య తరగతి ప్రజలను, వేతనాలపై ఆధారపడి జీవించేవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల ద్రోహం చేశారని దుయ్యబట్టింది. అధిక ద్రవ్యోల్బణం, జీతాల్లో కోత వల్ల ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపింది.
కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా బడ్జెట్‌పై స్పందించారు. కోవిడ్-19 మహమ్మారి, జీతాల్లో కోతలు, నడ్డి విరిచే ద్రవ్యోల్బణం సమయంలో వేతన జీవులు, మధ్య తరగతి వర్గాలు ఉపశమనం కోసం ఆశించాయన్నారు. ప్రత్యక్ష పన్నుల చర్యల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మరోసారి వారిని నిరాశపరిచారన్నారు. ఇది వేతన జీవులకు, మధ్య తరగతి ప్రజలకు నమ్మక ద్రోహమని ఆరోపించారు.
ఖాళీ జేబులతో ఉన్న యువత, రైతులు, వేతన జీవులు, పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇది శూన్య బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. కొనుగోలు శక్తిని పెంచడానికి, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్‌లో ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి