శభాష్‌ అభిజయ్‌!

ABN , First Publish Date - 2020-09-05T04:50:30+05:30 IST

ఏదైనా పోటీలో ప్రైజ్‌ మనీ గెలుచుకుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇష్టమైనవి కొనుక్కుంటారు.

శభాష్‌ అభిజయ్‌!

ఏదైనా పోటీలో ప్రైజ్‌ మనీ గెలుచుకుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇష్టమైనవి కొనుక్కుంటారు. మిగిలితే డబ్బులు దాచుకుంటారు. కానీ ఎనిమిదేళ్ల అభిజయ్‌ పొట్లూరి మాత్రం అలా చేయలేదు. తాను గెలుచుకున్న డబ్బులను ఇల్లు, ఆహారం లేని పిల్లల కోసం డొనేట్‌ చేశాడు.

 లాక్‌డౌన్‌ సమయంలో అభిజయ్‌ కరోనా వైర్‌సపై ఒక యానిమేషన్‌ వీడియోను రూపొందించాడు. తనకున్న ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌తో ఆ వీడియోను రూపొందించి యూనిసెఫ్‌ నిర్వహించిన ‘కొవిడ్‌-19  యానిమేషన్‌’ పోటీలకు పంపాడు. 

 ఆ పోటీలో ఒక లక్షా ఎనభై వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. అయితే ఆ డబ్బును ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేకుండా బాధపడుతున్న పిల్లల కోసం ఉపయోగించమని తిరిగి యూనిసెఫ్‌కు అందించాడు. ఎందుకలా డొనేట్‌ చేశావు అని అడిగితే... ‘‘యూనిసెఫ్‌ రూపొందించిన కొన్ని వీడియోలు చూశాక నా గుండె తరుక్కుపోయింది. ఎంతోమంది పిల్లలు ఇల్లు లేక రోడ్లపై జీవిస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు. వాళ్లకి ఎంతో కొంత సహాయం చేసిన వాణ్ణి కావాలని అనిపించింది. అందుకే డబ్బులు ఇచ్చేశా’’ అని అన్నాడు అభిజయ్‌. ఈ చిన్నారి చేసిన పనికి సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


Updated Date - 2020-09-05T04:50:30+05:30 IST