అధిక ధరకు పిలిచినా.. ఆసక్తి ఏదీ?

ABN , First Publish Date - 2021-01-09T05:13:41+05:30 IST

ఐటీడీఏలోని సీతంపేట ఏటీడబ్ల్యువో పరిధిలో 35 ఆశ్రమ, గురుకుల పాఠశాలలకు కూరగాయల సరఫరాకు టెండరుదారులు ఆసక్తి చూపడంలేదు. అధికారుల మధ్వ సమన్వయం లేకపోవడంతో హాస్టళ్లకు కూరగాయల సరఫరాకు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో టెండర్లలో గందరగోళం నెలకొంది.

అధిక ధరకు పిలిచినా.. ఆసక్తి ఏదీ?

ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు కూరగాయల సరఫరా టెండర్లలో గందరగోళం 

సమన్వయ లోపంతో సరఫరాలో జాప్యం

(సీతంపేట)

ఐటీడీఏలోని సీతంపేట ఏటీడబ్ల్యువో పరిధిలో 35 ఆశ్రమ, గురుకుల పాఠశాలలకు కూరగాయల సరఫరాకు టెండరుదారులు ఆసక్తి చూపడంలేదు. అధికారుల మధ్వ సమన్వయం లేకపోవడంతో హాస్టళ్లకు కూరగాయల సరఫరాకు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో టెండర్లలో గందరగోళం నెలకొంది. సీతంపేట ఐటీడీఏ నిర్వహిస్తున్న మందస, మెళియాపుట్టి, సీతంపేట ఏటీడబ్ల్యువో పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు ఈ విద్యా సంవత్సరంలో నాలుగు నెలలకు గానూ కూరగాయల సరఫరా కోసం గతనెల 23న టెండర్లు నిర్వహించారు. ఏడుగురికి టెండర్లు అప్పగించారు. గత ఏడాది కంటే ఈసారి ధరలు అధికంగా ఇచ్చినా టెండరుదారులకు ఆశ్రమ పాఠశాలల సర్దుబాటులో సమన్వయం కుదరలేదు. దీంతో కూరగాయల సరఫరాకు ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి ఏటా టెండర్లు ఎవరు తక్కువ కోడ్‌ చేస్తే వారికే ఇచ్చేవారు. ఈ ఏడాది అలా కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి టెండర్‌ దక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి మెనూ కింద.. 3 నుంచి 4వ తరగతి వరకు రోజుకు రూ.35, 5 నుంచి 10వ తరగతి వరకు రూ.41.66, ఇంటర్‌.. ఆ పై చదువులకు రూ.46.67 చొప్పున ఖర్చు చేస్తోంది. వీటితోనే సంబంధిత హాస్టల్‌ సిబ్బంది సరిపెట్టాలి. గత ఏడాది 22 రకాల కూరగాయలు రూ.199కు టెండరుదారులు సరఫరా చేశారు. ఈ ఏడాది ఏకంగా రూ.355కు కూరగాయలు సరఫరా చేసేవిధంగా టెండరుదారులకు అధికారులు అవకాశం కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు పెరిగితే ఆ భారం సంబంధిత వార్డెన్లపై పడే అవకాశం ఉంది. ఒక పక్క మెనూ అమలు విషయంలో ఎటువంటి లోపాలు ఉన్నా, చర్యలు తప్పవని పదే పదే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచి టెండరుదారులకు లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. హాస్టళ్ల కేటాయింపులో లోపాలు తలెత్తడంతో టెండరుదారులు కూరగాయల సరఫరాలో జాప్యం చేస్తున్నారు. దీంతో కూరగాయలు బయట కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఎం.కమల వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. కూరగాయల టెండరుదారులతో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ అంశాన్ని పీవో దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. సరఫరా చేసిన వారికే అవకాశం కల్పిస్తామన్నారు. లేకపోతే టెండర్లలో పాల్గొన్న వారి అంగీకారం ప్రకారం ఆ హాస్టళ్లు కూడా వీరికే  అప్పగిస్తామని తెలిపారు. 

 

ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే కూరగాయల  ధరలు ఇలా.. 

-----------------------

2019-20లో   

-----------------------

బంగాళ దుంపలు రూ.18.00

ఉల్లిపాయలు రూ. 18.00

వంకాయలు రూ. 22.00

దొండకాయలు రూ. 20.00

బీరకాయలు రూ. 02.00

బెండ, టమోట, ఆనపకాయలు రూ. 20.00

బీట్రూట్‌ రూ. 2.00

కాలీఫ్లవర్‌ రూ. 2.00

పొడుగు చిక్కుడు రూ. 2.00

పచ్చిమిర్చి రూ. 2.00

అల్లం రూ. 2.00

కాకరకాయ రూ. 2.00

మునగకాడలు రూ.2.00

ముల్లంగి రూ. 2.00

అరటికాయ రూ. 2.00

క్యారెట్‌ రూ. 3.00

దోసకాయి రూ. 2.00

సారికంద రూ. 10.00 

====================


ఈ విద్యా సంవత్సరంలో

--------------------

పొటల్స్‌ రూ. 22.00

ఉల్లి రూ. 23.00

వంకాయలు రూ.  20.00

దొండకాయలు రూ. 20.00

బెండకాయలు రూ. 20.00

టమోట రూ. 19.00

క్యాబేజి రూ. 17.50

ఆకు కూరలు రూ. 20.00

కాలీఫ్లవర్‌ రూ. 15.00

చిక్కుడ్లు రూ. 18.00

పచ్చిమిర్చి రూ. 25.00

ఆనపకాయలు రూ. 17.00

మునగకాయలు రూ. 23.00

ముల్లంగి రూ. 10.00

క్యారెట్‌ రూ. 13.00

దోసకాయలు రూ.  15.00 

Updated Date - 2021-01-09T05:13:41+05:30 IST