ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం

ABN , First Publish Date - 2021-01-16T06:00:19+05:30 IST

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం గందరగోళంగా మారింది. ఆది నుంచీ బదిలీల ప్రక్రియలో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతా సంక్రాంతి పండగ చేసుకుంటున్న సమయంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉపాధ్యాయుల బదిలీల జాబితాను ఆన్‌లైన్‌లో పొందపర్చడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం

బుధవారం అర్ధరాత్రి ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు

పండుగ వేళ ఇబ్బందులు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం గందరగోళంగా మారింది. ఆది నుంచీ బదిలీల ప్రక్రియలో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతా సంక్రాంతి  పండగ చేసుకుంటున్న సమయంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉపాధ్యాయుల బదిలీల జాబితాను ఆన్‌లైన్‌లో పొందపర్చడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన ప్రతి ఉపాధ్యాయుడికీ ఆన్‌లైన్‌ విధానంలో బదిలీ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు గత ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో బదిలీల ప్రక్రియ కొనసాగించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బదిలీల కోసం వెబ్‌ ఆప్షన్‌లు పెట్టుకునేందుకు గత నెల 31 వరకు ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది.  కొందరు ఉపాధ్యాయులు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియలో అనేక లోటుపాట్లు చోటుచేసుకున్నాయి. ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయినా కొన్ని సెంటర్లలో బదిలీలల ఆప్షన్‌లను ఆన్‌లైన్‌ జాబితాలో చూపకపోవడాన్ని ఉపాధ్యాయులు తప్పుబట్టారు. వెబ్‌ ఆప్షన్‌లు పెట్టుకునేందుకు గడువు దగ్గర పడుతున్నా, వెబ్‌ పోర్టల్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఉపాధ్యాయులు నానా యాతన పడాల్సి వచ్చింది. చివరకు డీఈఓ, ఎంఈఓ కార్యాలయాలకు వెళ్లి ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి వచ్చింది. 


జిల్లాలో ఇలా...


జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌లు బదిలీల కోసం సుమారు 980 మంది ఆన్‌లైన్‌లో ఆప్షన్‌లు పెట్టుకోగా, మరో 2235 మంది ఎస్‌జీటీలు ఆన్‌లైన్‌లో ఆప్షన్‌లు పెటుకుని బదిలీల కోసం వేచి చూస్తున్నారు.  వాస్తవానికి ప్రభుత్వ షెడ్యూల్‌ ప్రకారం జనవరి 1 లేదా 2వ తేదీల్లో బదిలీల జాబితా ఆన్‌లైన్‌లో పెట్టాలి. కానీ ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో బదిలీల జాబితా పెట్టలేదు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కొనసాగుతున్నందున ఈనెల 18వ తేదీ తరువాతే జాబితా వెలువడుతుందని భావించారు. కాగా అనూహ్యంగా, విద్యాశాఖ అధికారులు 13వ తేదీ (బుధవారం) అర్ధరాత్రి 12 గంటల తరువాత ఆన్‌లైన్‌లో జాబితాను పెట్టారు. అంతే కాకుండా మరుసటి రోజే బదిలీ అయిన ఉపాధ్యాయులు జాయినింగ్‌ రిపోర్టులు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో సంక్రాంతి పర్వదినం వేళలో ఉపాధ్యాయులంతా సమయం, సందర్భం లేని బదిలీ ఉత్తర్వులను పట్టుకొని నానా హైరానా పడ్డారు. సంక్రాంతి రోజున ప్రధానోపాధ్యాయులు అందుబాటులో లేని కారణంగా వారి కోసం ఉపాధ్యాయులు పాఠశాలల వద్ద పడిగాపులు కాశారు. ఇదిలా ఉండగా  ఈనెల 13న కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ల బదిలీల జాబితాలను మాత్రమే పెట్టారు. ఎస్‌జీటీల జాబితా ఇంకా పెట్టలేదు. పండుగతో ఆ జాబితా ఎప్పుడు ఏ క్షణంలో పెడతారోనని ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌లు బదిలీల ప్రక్రియలో లోపాలపై కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయులు లేని కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు యథావిధిగా బదిలీల కోసం ఆన్‌లైన్‌ విధానంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కోర్టును ఆశ్రయించిన ఉపాధ్యాయులకే బదిలీల్లో పాయింట్లు ఇచ్చారని, తమకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా ఏకపక్షంగా బదిలీల ప్రక్రియ చేసి, పండగ అని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఆన్‌లైన్‌లో జాబితాలను పెట్టి ఇబ్బంది పెట్టారంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బదిలీ అయిన చోట ఉపాధ్యాయులు రిలీవ్‌ కాకపోవడంతో కొత్తగా బదిలీ అయిన వారు ఆయా స్థానాల్లో చేరేందుకు నానా యాతన పడుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ఆది నుంచి విద్యాశాఖ అధికారులు సరైన విధానాలు పాటించలేదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2021-01-16T06:00:19+05:30 IST