పీఎం కేర్‌ నిధిపై లోక్‌సభలో గందరగోళం

ABN , First Publish Date - 2020-09-19T07:20:33+05:30 IST

పీఎం కేర్‌ నిధి పారదర్శకతపై లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరు పక్షాల నేతలు పరస్పరం వివాదాస్పద

పీఎం కేర్‌ నిధిపై లోక్‌సభలో గందరగోళం

నెహ్రూ, సోనియా గాంధీపై అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు..

కౌన్‌ హై యే ఛోక్రా అంటూ అధీర్‌ రంజన్‌ ఆగ్రహం..

నాలుగుసార్లు వాయిదా పడ్డ లోక్‌సభ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పీఎం కేర్‌ నిధి పారదర్శకతపై లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరు పక్షాల నేతలు పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఈ వర్షాకాల సమావేశాల్లో మొట్టమొదటిసారిగా సభ పలుమార్లు వాయిదా పడింది. పలుమార్లు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చారు. 


నెహ్రూ కుటుంబంపై  కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమయంలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు నిరసన తెలిపారు. సభ నాలుగుసార్లు వాయిదా పడ్డ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా వచ్చి సభ్యులను శాంతపరచడమే కాకుండా జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారు. అనురాగ్‌ ఠాకూర్‌ కూడా తనకు ఎవరి మనస్సులను గాయపరిచే ఉద్దేశం లేదని చెప్ప డం, హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌,  కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ దాస్‌ కూడా సభ మర్యాదను తాము కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో తర్వాత సభ సజావుగా సాగింది.


శుక్రవారం ఉదయం టాక్సేషన్‌, ఇతర చట్టాల సవరణ బిల్లులో భాగంగా పీఎం కేర్‌ నిధికి వచ్చే విరాళాలకు కూడా పన్ను మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశా యి. ఇది పారదర్శకంగా లేదని ప్రతిపక్షాలు చేసిన వ్యా ఖ్యకు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ జవాబిచ్చారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ అన్నీ పీఎం కేర్‌ ఫండ్‌కు ఆమోద ముద్ర వేశాయని, చిన్న పిల్లలు కూడా తమ పిగ్గీ బ్యాంకుల నుంచి డబ్బు ఇచ్చారని మంత్రి సమర్థించుకున్నారు.


అయితే నెహ్రూ 1948లో ఒక నిధిని ఏర్పా టు చేశారని, అది ఇప్పటి వరకూ రిజిస్టర్‌ చేయలేదని, దానికి సోనియాగాంధీని చైర్మన్‌గా చేసి గాంధీ కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని, దీనిపై విచారణ జరపాలన్నారు. దీనిపై కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా ఎవరీ పిల్లవాడు(కౌన్‌ హై యే ఛోక్రా) అని కాంగ్రెస్‌ లోక్‌సభా నేత అధీర్‌ రంజన్‌చౌధురి వ్యాఖ్యనించడంతో బీజేపీ పక్షాలూ భగ్గుమన్నాయి. హిమాచల్‌ నుంచి వచ్చిన ఈ పిల్లవాడు ఎవరు? నెహ్రూను ఎందుకు చర్చలోకి లాగారు? మేము ప్రధాని పేరు తీసుకున్నామా? అని ఆయన అన్నారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   



సభ్యులు గుసగుసలు పెట్టొద్దు: వెంకయ్య


సభలో సభ్యులు ఒకరి వద్దకు మరొకరు వెళ్లడం... ప క్క సభ్యుల చెవుల్లో గుసగుసలాడటం వంటివి చేయొద్దని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు స్పష్టం చేశా రు. స్లిప్‌(చీటీలు)ల ద్వారా సభ్యులు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. పరీక్ష గదుల్లో చీటీలను అనుమతించరని, రాజ్యసభలో మాత్రం చీటీలకు భేషుగ్గా అనుమతి ఉంటుందంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించారు. శుక్రవారం శూన్యగంట కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సభలో సభ్యులు నడుచుకోవాల్సిన తీరుపై వెంకయ్య కీలక సూచనలు చేశారు. సభ్యులెవరూ తన (చైర్మన్‌) కార్యాలయానికి రావొద్దని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-19T07:20:33+05:30 IST