కీలకశాఖలు ఖాళీ

ABN , First Publish Date - 2022-07-02T05:24:04+05:30 IST

సీతంపేట ఐటీడీఏలో కీలక శాఖలన్నీ ఖాళీగా ఉన్నాయి. సాధారణ బదిలీలో కొంతమంది, జిల్లాల పునర్విభజనలో మరికొంతమంది ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. అయితే రిలీవర్‌ జాయిన్‌ అవ్వకుండానే బదిలీ అయిన ఉద్యోగిని రిలీవ్‌ చేయడంతో కీలకశాఖలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

కీలకశాఖలు ఖాళీ
సిబ్బంది లేక వెలవెలబోతున్న సీతంపేట ఐటీడీఏ కార్యాలయం

  రిలీవర్‌ రాకుండానే బదిలీ అయిన ఉద్యోగికి రిలీవ్‌

  ఐటీడీఏలో గందరగోళం 

 స్తంభిస్తున్న కార్యకలాపాలు

  ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం

(సీతంపేట) 

సీతంపేట ఐటీడీఏలో కీలక శాఖలన్నీ ఖాళీగా ఉన్నాయి. సాధారణ బదిలీలో కొంతమంది, జిల్లాల పునర్విభజనలో మరికొంతమంది ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. అయితే రిలీవర్‌ జాయిన్‌ అవ్వకుండానే బదిలీ అయిన ఉద్యోగిని రిలీవ్‌ చేయడంతో కీలకశాఖలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఐటీడీఏలో కీలకశాఖలన్నీ ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నప్పటికీ ఆ స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు తెలెత్తుతున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. 

వాస్తవంగా సీతంపేట ఐటీడీఏలో పీవో మినహా మిగతా శాఖలకు అధికారులను నియమించలేదు. దీంతో పాలనాపరమైన కార్యకలాపాలను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోనే నిర్వహిస్తున్నారు. కీలకశాఖలైన గిరిజన సంక్షేమ, విద, ఉద్యాన, వ్యవసాయ, ఐటీడీఏ పరిపాలన, వెలుగు, వైద్యశాఖలకు సంబంధించి అధికారులు లేరు. దీంతో కార్యకలాపాలన్నీ మందగించాయి. ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమలను ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యింది. ఐటీడీఏ ఏపీవో కూడా గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఐటీడీఏ ప్రాజెక్టు వ్యవసాయ శాఖాధికారి జిల్లాల పునర్విభజన అనంతరం శ్రీకాకుళం వ్యవసాయ శాఖకు బదిలీపై వెళ్లారు. ప్రాజెక్టు హార్టికల్చర్‌ అధికారి పదోన్నతిపై మన్యం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఉపవైద్యాధికారి, ఉప విద్యా శాఖాధికారులను కొంతకాలంగా ఎవరినీ నియమించడం లేదు. దీంతో ఏరియా ఆసుపత్రివైద్యాధికారికి ఉపవైద్యాధికారి బాధ్యతలు అప్పగించారు. ఇంతకాలం ఉప విద్యాశాఖ బాధ్యతలను డీడీ పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఐటీడీఏలో మేనేజర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, ఏపీవో పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. మెళియాపుట్టి, సీతంపేట సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారులు బదిలీ కావడంతో ఆ పోస్టుల్లో వేరే వారిని నియమించినప్పటికీ వారు బాధ్యతలు స్వీకరించలేదు. ఇదిలా ఉండగా మరికొంతమంది ఉద్యోగులు బదిలీలు అవ్వకుండా చేసుకోగలిగారు. ఇప్పటికే టెట్‌ కోచింగ్‌ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు ఈ నెల ఐదో తేదీ నుంచి పాఠశాల పునఃప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కీలకమైన గిరిజన సంక్షేమశాఖ అధికారి, ఉపవిద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 


  


Updated Date - 2022-07-02T05:24:04+05:30 IST