విద్యాశాఖ బదిలీల్లో గందరగోళం..!

ABN , First Publish Date - 2022-06-30T07:25:35+05:30 IST

ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో బోధనేతర సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది.

విద్యాశాఖ బదిలీల్లో గందరగోళం..!
బదిలీల కౌన్సెలింగ్‌

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ప్రక్రియ 

పూర్తి ఖాళీలు చూపలేదని విమర్శ 

రాత్రి 7 దాటాక బోధనేతర సిబ్బందికి కౌన్సెలింగ్‌ 

చిత్తూరు (సెంట్రల్‌), జూన్‌ 29: ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో బోధనేతర సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. షెడ్యూల్‌కు ఒకరోజు ముందుగా బుధవారం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో పూర్తి ఖాళీలు చూపకపోవడంతో తామెక్కడికి ఆప్షన్‌ పెట్టుకోవాలో తెలియలేదని వీరు ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టడంతో బదిలీ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలోని నలుమూలల నుంచి సిబ్బంది డీఈవో కార్యాలయానికి వచ్చారు. ఉదయం నుంచి కార్యాలయంలో పడిగాపులు కాసినా, రాత్రి 7 గంటలపైనే బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఐదేళ్లు ఒకే చోట సర్వీసున్న వారిని తప్పని సరిగా బదిలీ చేయాలని నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో పూర్తి ఖాళీలు చూపకుండానే బదిలీ కౌన్సెలింగ్‌ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫార్సు లేఖలను ప్రామాణికంగా తీసుకునే క్రమంలోనే ఖాళీలు చూపలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని ఉద్యోగులు బదిలీల్లో అభ్యర్థన (రిక్వస్టు) పెట్టుకున్నారు. తిరుపతి జిల్లాలోని ఉద్యోగుల్లో ఎవరూ రిక్వెస్టు పెట్టుకోలేదు. చిత్తూరు జిల్లా విద్యాశాఖలోని ఉద్యోగులకు రిక్వెస్టు పెట్టుకోడానికి జిల్లా అధికారులు అనుమతివ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఒకే జిల్లాలో బదిలీలకు ఎలాంటి అభ్యంతరం చెప్పని అధికారులు.. ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మ్యూచువల్‌ ఉంటేనే పక్క జిల్లాకు అనుమతిస్తామని స్పష్టంచేశారు. దీనిపై డీఈవో పురుషోత్తం వివరణ ఇస్తూ.. ఒకే జిల్లా పరిధిలోని వారికి బదిలీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, పక్క జిల్లాలకు వెళ్లాలంటే మ్యూచువల్‌ చూపితే బదిలీ చేస్తున్నామని చెప్పారు.


Updated Date - 2022-06-30T07:25:35+05:30 IST