Abn logo
Sep 20 2021 @ 00:48AM

కౌంటింగ్‌లో గందరగోళం

వైసీపీ ఏజెంట్ల హల్‌చల్‌

టెక్కలి/టెక్కలి రూరల్‌: టెక్కలి నియోజవర్గానికి సంబంధించి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో అధికార పార్టీ వైసీపీ ఏజెంట్లు హల్‌చల్‌ చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో టెక్కలి మండలం తొలుసూరుపల్లి ఎంపీటీసీ కౌంటిం గ్‌ సమయంలో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ ఏజెంట్లపై వైసీపీ ఏజెంట్లు తిరుగుబాటు చేశారు. దీంతో తమను పోలీసులు బయటకు పంపివేశారని టీడీపీ  వర్గీయులు ఆరోపించారు. అందువల్లే తాము ఓటమి పాలయ్యామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. టెక్కలి-4 ప్రాదేశికానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి, ఆ పార్టీ రెబల్‌ అభ్యర్థుల మధ్య పోటాపోటీగా కౌంటింగ్‌ జరిగిన సమయంలో కూడా ఇరువురి ఏజెంట్ల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సీఐ నీలయ్య అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సంత బొమ్మాళి మండలం నర్సాపురం ఎంపీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి గెలుపొందే స్థితి ఉండడంతో వైసీపీ ఏజెంట్లు టీడీపీ ఏజెంట్‌తో వాగ్వాదానికి, ఘర్షణకు దిగారు. చివరికి టీడీపీ అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు.