రాళ్లపాడు రైతుల్లో అయోమయం

ABN , First Publish Date - 2021-11-30T06:43:36+05:30 IST

రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై అధికారుల తీరు రైతులను ఆయోమయానికి గురిచేసే విధంగా ఉంది.

రాళ్లపాడు రైతుల్లో అయోమయం
రాళ్లపాడులో జలాలు

నిండా నీరున్నా, ఆరుతడులకే ఇస్తారట..?

చేపల పెంపకదారుల కోసం నీరివ్వడం లేదని రైతుల ఆరోపణ 

లింగసముద్రం, నవంబరు 29 : రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై అధికారుల తీరు రైతులను ఆయోమయానికి గురిచేసే విధంగా ఉంది. పంచ పాండవులు మంచంకోళ్లలా ముగ్గురు అని రెండేళ్లు చూపిన చందంగా ఇరిగేష న్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. వరికి సాగునీరు ఇవ్వాలని రైతులు స్పష్టం గా కోరారు. అయినప్పటికీ, గుట్టుగా కాలువల నుంచి నీరొదిలి ఆరుతడులకు నీరిస్తున్నట్లు ఎస్‌ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాగాణికి నీరివ్వలేకపోవడానికి కనీసం కారణాలను కూడా రైతులకు స్పష్టం చేయకుండా ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ముఖం చాటేస్తున్నారు. 

సుమారు రెండు వారాల పాటు వర్షాలు కురిసిన వర్షానికి ప్రాజెక్టు జలకళతో నిండుకుండలా ఉంది. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టు నిండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22న రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. రైతుల్లో నీరు ఎప్పుడు విడుదల చేయాలన్నదానిపై కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, మొత్తంగా వరి సాగుకు నీరివ్వాలని కోరారు. ఇరిగేషన్‌ అధికారుల వెంట వచ్చిన వ్యవసాయశాఖ అధికారులు కూడా నీటి ఎద్దడి లేకుండా తక్కువ కాలంలో పంట చేతికొచ్చే వరి రకాలను సూచించారు. సమావేశ సమాచారాన్ని ఎస్‌ఈకి తెలియజేసి ఆయన సూచన మేరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ఏర్కొన్నారు. ఇంత వరకు భాగానే ఉన్నా... ఆకస్మాతుగా ఎలాంటి హడావిడి లేకుండా ఐదు రోజుల క్రితం ఇరిగేషన్‌ అధికారులు నీటిని విడుదల చేశారు. రైతులు మాగాణికి నీరిస్తున్నారని భావించారు. ఎస్‌ఈ విడుదల చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఆరుతుడులకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు కురుస్తుంటే ఆరుతడులకు నీరెందుకు విడుదల చేశారో..? ఇరిగేషన్‌ అధికారుల వద్ద స్పష్టమైన సమాదానం లేదు. ఇక వరి సాగుకు నీరెందుకు ఇవ్వలేకపోతున్నారో కూడా రైతులకు తెలియజేయలేదు. దీంతో ఇరిగేషన్‌ ఎస్‌ఈ విడుదల చేసిన ఉత్తర్వులు రైతులను ఆయోమయంలోని నెట్టాయి. ఆ ప్రకటనలో సోమశిల నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు నీటిని రాళ్లపాడుకు నీటిని రప్పిస్తామని అధికారులు చెప్పారు. అయితే గతంలో 2011లో 14 అడుగుల నీటితో, 2016లో 18 అడుగుల నీటితో అధికారులు ఆయకట్టు పరిధిలో వరికి నీరిచ్చారు. అయితే గతేడాది పూర్తిస్థాయిలో నీరు రావడంతో రైతులు వరి పండించుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండీ, దిగువకు  కూడా నీరు విడదల చేశారు. ఇంత పుష్కలంగా నీరున్నప్పటికీ, వరికిసాగునీరు ఎందుకు ఇవ్వరన్నదానిపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి సమాదానం లేదు. రెండు రోజులు నుంచి వర్షాల నేపథ్యంలో అధికారులు నీటి విడుదలను నిలిపేశారు. మరోసారి నీరు విడుదల చేసే క్రమంలో స్పష్టమైన సమాచారంతో నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

ఎందరికో జీవనాధారమైన ప్రాజెక్టు

ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు ఈ ప్రాజెక్టే జీవనాధారం.   ఆయకట్టు పరిధిలో వరిసాగు చేయకుంటే రైతుల తిండి గింజలకు, పశుగ్రాసానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.  అంతేగాక వేలాది మంది రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఆధారమైన పాడి పరిశ్రమ కూడా దెబ్బతింటుంది. దీంతో ప్రాజెక్టు పరిధిలో వరిసాగుకు నీరివ్వాలని రైతులు కోరుతున్నారు.

చేపల పెంపకంతో ఇబ్బందులు

ప్రాజెక్టు నుంచి కాలువలకు వచ్చిన నీరు రైతులకు జీవనాధారం కాగా, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు మత్స్యకారులకు జీవనాధారంగా ఉంటుంది. ప్రాజెకులో ఉండే చేపలను పట్టుకొని మత్స్యకారులు జీవనం వెళ్లదీస్తుంటారు. పెదపవని ఫిషరీస్‌ సొసైటీ వారికి చేపలుపట్టుకొనేందుకు అనుమతి ఉంది. అయితే ఈ ప్రాజెక్టులో మాత్రం చేపల పెంపకం కోసం చోట రాజకీయ నేతలు ఆసక్తి చూపుతారు. ప్రాజెక్టులో సహజంగా పెరిగే చేపలను పట్టుకోవడానికి మత్స్యకారులకు అనుమతులున్నాయి. అయితే వీరిని నయానో... భయానో ఒప్పించుకున్న కొంత మంది నేతలు చేప పిల్లలు వదిలి వాటికి మేత వేసి  పెంచుకుంటారు. చేపలు పెరిగిన తర్వాత ఈ రాజకీయ నేతలే చేపల వ్యాపారం చేస్తారు. దీనిపై నేతలకు అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. దీంతో ప్రాజెక్టు నీరు విడుదల చేయకుండా అధికారులను ప్రసన్నం చేసుకోవడం వీరికి పరిపాటిగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాళ్లపాడు ప్రాజెక్టు నిర్వహణ అనధికారంగా చేపల వ్యాపారుల చేతుల్లో ఉండడంతో రైతులు సాగునీటికి తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘రాళ్లపాడు పరిరక్షక సమితి’ అధ్యక్షుడు కాకుమాను మాధవరావు తెలిపారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని వరి సాగుకు నీరిచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-30T06:43:36+05:30 IST