‘అభయహస్తం’ అందేనా?

ABN , First Publish Date - 2021-12-09T04:55:38+05:30 IST

అభయహస్తం పింఛన్‌ అమలుపై లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా ఉన్న ఎల్‌ఐసీతో ఉన్న ఒప్పందాన్ని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. దీంతో ఆ సంస్థ అభయహస్తం సొమ్ములను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌)కు నిధులు బదలాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభయహస్తం పింఛన్‌ పథకాన్ని ఇక మీదట సెర్ప్‌ నిర్వహించనుంది.

‘అభయహస్తం’ అందేనా?
స్వయంశక్తి సంఘాల మహిళలు

- ఎల్‌ఐసీతో ఒప్పందం రద్దు

- సెర్ఫ్‌కు నిధులు మళ్లింపు

(ఇచ్ఛాపురం రూరల్‌)

అభయహస్తం పింఛన్‌ అమలుపై లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా ఉన్న ఎల్‌ఐసీతో ఉన్న ఒప్పందాన్ని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. దీంతో ఆ సంస్థ అభయహస్తం సొమ్ములను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌)కు నిధులు బదలాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభయహస్తం పింఛన్‌ పథకాన్ని ఇక మీదట సెర్ప్‌ నిర్వహించనుంది.  స్వయంశక్తి సంఘాల్లో మహిళలకు వృద్ధాప్యంలో ఆసరా కోసం 2009లో దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి అభయహస్తం పింఛన్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంఘ సభ్యుల్లో 18 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలు లబ్ధిదారుని వాటాగా ఏడాదికి రూ.365లు చెల్లిస్తే.. అంతే మొత్తాన్ని ప్రభుత్వ వాటా కలిపి జమ చేసేది. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛన్‌ అందించేది. ప్రస్తుతం  ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఈ పథకం నుంచి ఎల్‌ఐసీ వైదొలిగింది. ఈ నేపథ్యంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు అభయహస్తం పింఛన్‌ సక్రమంగా అందుతుందో లేదోనన్నది చర్చనీయాంశమవుతోంది. 


జిల్లాలో 14,747 మందికి పింఛన్లు : 

జిల్లాలో 59,382 స్వయంశక్తి సంఘాలు ఉన్నాయి. అందులో 6,74,344 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఇప్పటి వరకు అభయహస్తం పథకానికి 1.16 లక్షల మంది మహిళలు డబ్బులు చెల్లిస్తున్నారు. వీరిలో 14,747 మందికి అభయహస్తం పింఛన్లు అందజేస్తున్నారు.  మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించని వారిని గుర్తించి వారికి సొమ్ములు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే వారి వ్యక్తిగత వాటాతో పాటు ప్రభుత్వం వాటా సొమ్ములు చెల్లిస్తారు. ఈ పథకం కింద బీమా సదుపాయం కూడా ఉంది. సాధారణ మరణానికి రూ.30వేలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.75వేల వరకు బీమా అందిస్తారు. ఎల్‌ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుని, నిధులు బట్వాడా చేసిన నేపథ్యంలో ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు చెల్లించాలని చూస్తోంది. 


విధి విధానాలు రావాలి

అభయహస్తానికి సంబంధించి ఎల్‌ఐసీ వైదొలిగింది. వాటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి విధి విధానాలు రాలేదు. అవి వచ్చిన తరువాత వాటికి సంబంధించిన చెల్లింపులు చేపడతాం. 

- బి.శాంతిశ్రీ, డీఆర్‌డీఏ పీడీ

Updated Date - 2021-12-09T04:55:38+05:30 IST