ఎంపికతోనే సరి!

ABN , First Publish Date - 2021-04-05T03:34:56+05:30 IST

‘కేవలం ఇళ్లు కాదు. ఊళ్లనే కొత్తగా నిర్మిస్తాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేవలం లబ్ధిదారుల ఎంపికతోనే సరిపెట్టేసింది. ఇళ్ల నిర్మాణాల ఎంపికలో ఆప్షన్లను వివిధ చోట్ల వలంటీర్లు మార్చేయడంతో అంతటా అయోమయం నెలకొంది. దీనికితోడు గత ప్రభుత్వం కంటే యూనిట్‌ ధర తగ్గించడంతో ఒక్కో లబ్ధదారుడికి రూ.70వేల వరకు కోత పడింది.

ఎంపికతోనే సరి!
పొందూరు మండలంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు


ఇళ్ల నిర్మాణాలపై అయోమయం

ఆప్షన్లు మార్చేసిన వలంటీర్లు

యూనిట్‌పై రాష్ట్ర వాటాను ఎత్తేసిన ప్రభుత్వం

ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

‘కేవలం ఇళ్లు కాదు. ఊళ్లనే కొత్తగా నిర్మిస్తాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేవలం లబ్ధిదారుల ఎంపికతోనే సరిపెట్టేసింది. ఇళ్ల నిర్మాణాల ఎంపికలో ఆప్షన్లను వివిధ చోట్ల వలంటీర్లు మార్చేయడంతో అంతటా అయోమయం నెలకొంది. దీనికితోడు గత ప్రభుత్వం కంటే యూనిట్‌ ధర తగ్గించడంతో ఒక్కో లబ్ధదారుడికి రూ.70వేల వరకు కోత పడింది. ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఆప్షన్ల నమోదులో గందరగోళం నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు 97,616 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిర్మాణాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఇందులో మొదటిది ఎవరి ఇళ్లు వారే నిర్మించుకోవాలి. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. రెండోవది.. ప్రభుత్వం నిర్మాణ సామగ్రి ఇస్తే.. లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలి. ఇక మూడోవది ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకుని.. వలంటీర్ల ద్వారా ఇళ్ల నిర్మాణ పత్రాలు సమర్పించాలని సూచించింది. యూనిట్‌ ధర తగ్గించడంతో చాలా మంది లబ్ధిదారులు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. కానీ ఈ ఆప్షన్‌ కేవలం అనాథలు, వృద్ధులకు మాత్రమేనంటూ వలంటీర్లు దరఖాస్తులు తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినా.. వలంటీర్లు లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆప్షన్ల ఎంపిక నివేదికలు మార్చేశారనే ఆరోపణలు  ఉన్నాయి. వలంటీర్లు నమోదు చేసిన దరఖాస్తుల ఆధారంగా పరిశీలిస్తే.. మొదటి ఆప్షన్‌కు 73,212 మంది లబ్ధిదారులు అంగీకరించారు. రెండో ఆప్షన్‌ను 4,880 మంది ఎంచుకున్నారు. ఇక మూడో ఆప్షన్‌కు 19,524 మంది అంగీకరించినట్టు తేలింది. ఈ నేపథ్యంలో చాలా మంది లబ్ధిదారులు.. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మేము కోరగా.. వలంటీర్లు ఆప్షన్‌ మార్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థలాలు, ప్రభుత్వం నుంచి పొజీషన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నవారికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వదని అధికారులు తేల్చేశారు.  దీంతో గందరగోళం నెలకొంది. 


 ఒక్కో యూనిట్‌పై రూ.70వేల కోత

తొలివిడతలో శ్రీకాకుళం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) పరిధిలోని ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘సుడా’ పరిధిలో 28 మండలాలు, ఆరు మునిసిపాల్టీలలో పేదల నివాస స్థలాలు పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌కు గతంలో కేంద్రం వాటా రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష వరకు ఉండేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షల వరకు చెల్లిస్తుంటే దాన్ని తామే చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొత్తగా ఇళ్లు నిర్మించే లబ్ధిదారుడికి యూనిట్‌పై రూ.70వేలు కోతపడింది. దీనిపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


 పూర్తికాని ఏర్పాట్లు 

పేదలకు సెంటు స్థలం మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 271 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉండాలని సూచిస్తోంది. లివింగ్‌రూం 77 అడుగులు, వంటగది 35 అడుగులు, బెడ్‌రూం 82 అడుగులు, మరుగుదొడ్డి 24 అడుగులు ఉండాలని సూచించింది. ఓపెన్‌ వరండా 68 అడుగుల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ నుంచి నగదు మినహాయించుకుని హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్మాణ సామగ్రి సరఫరా చేస్తుంది. సచివాలయాల ఉద్యోగులు నిర్మాణాలను పర్యవేక్షిస్తారని, లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. సామగ్రి కొనుగోలుకు జిల్లాస్థాయి కమిటీలు ధరలను నిర్ణయించి పంపిణీ చేయనున్నాయి. సామగ్రి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. తాగునీరు, రోడ్లు, మురుగుకాలువలు, విద్యుత్‌ పనులు, పార్కులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, రేషన్‌షాపుల ఏర్పాటుకు చర్యలు లేవు. దీంతో ఎప్పటికి ఇవన్నీ పూర్తవుతాయో.. పేదల సొంతింటి కల నెరవేరుతుందో తెలియని దుస్థితి నెలకొంది. 


చర్యలు చేపడుతున్నాం 

ప్రభుత్వం నిర్మించే జగనన్న కాలనీల పనులు ప్రారంభించినట్టే. కాలనీలో ఒక్కో లబ్ధిదారుడికి 20 మెట్రిక్‌ టన్నుల ఇసుక రవాణాకు ఉచితం. పేదల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి సరఫరా చేస్తుంది. సుడా ఆధ్వర్యంలో 28 మండలాలు, ఆరు మునిసిపాలిటీల్లో పనుల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే బోర్లు నిర్మాణానికి పరిపాలన అనుమతి జారీచేశాం. ఇందుకోసం రూ. 37.5కోట్లు చెల్లింపులకు బిల్లులు సిద్ధం చేశాం. వీటి పనులు అర్బన్‌లో పబ్లిక్‌హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యుఎస్‌ సిబ్బంది పర్యవేక్షిస్తారు. 250 బోర్లు గ్రౌండ్‌ అయ్యాయి.  

- వేణుగోపాల్‌, గృహ నిర్మాణశాఖ పీడీ 



Updated Date - 2021-04-05T03:34:56+05:30 IST