ఉచిత రేషన్‌పై అయోమయం

ABN , First Publish Date - 2021-12-03T06:04:39+05:30 IST

ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని మరో నాలుగు నెలలు పొడగించినట్లు ప్రకటించింది. దీనికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం కూడా బియ్యం ఇస్తుందని లబ్ధిదారులు భావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రేషన్‌ లబ్ధిదారుల్లో డిసెంబరు బియ్యం పంపిణీలో మాత్రం అయోమయం నెలకొంది.

ఉచిత రేషన్‌పై అయోమయం

- కేంద్రం ప్రకటించినా అందని ఆర్డర్లు

- డిసెంబరులో డబ్బులకే బియ్యం

-  యథావిధిగా 6 కిలోలు పంపిణీ  

- జిల్లాకు 22,94,202 కిలోలు కేటాయింపు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని మరో నాలుగు నెలలు పొడగించినట్లు ప్రకటించింది. దీనికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం కూడా బియ్యం ఇస్తుందని లబ్ధిదారులు భావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రేషన్‌ లబ్ధిదారుల్లో డిసెంబరు బియ్యం పంపిణీలో మాత్రం అయోమయం నెలకొంది.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యానికి సంబంధించిన ఆర్డర్లు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం   స్పష్టత ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో లబ్ధిదారులు, రేషన్‌ డీలర్లలో గందరగోళం నెలకొంది. కరోనా విపత్తులో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులో పడిన పేద కుటుంబాలకు ఊరటనిచ్చిన ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ కొనసాగించాలని విపక్షాలు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రెండు నెలలు 15 కిలోల చొప్పున ఆ తర్వాత 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూం, చేనేత, కార్మిక కుటుంబాలతోపాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న బలహీనవర్గాలకు ఉపయోగకరంగా మారింది. నవంబరుతో ఉచిత కోటా ముగియడంతో మళ్లీ పాత పద్ధతిలోనే బియ్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని లబ్ధిదారులు భావించారు. కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యం డిసెంబరులో ఊరట నిస్తుందని భావించినా నిరాశే మొదలైంది. ప్రస్తుతం పాత పద్ధతిలో కిలో రూపాయి చొప్పున లబ్ధిదారుడికి 6 కిలోల బియ్యం పంపిణీ చేయడానికి  కోటా కేటాయించారు. 

వచ్చే నెలలో రెట్టింపు కోటా వస్తుందా?  

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం  జనవరి నుంచి పంపిణీ చేస్తారని లబ్ధిదారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 5 కిలోలు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులు డీలర్ల వద్ద ఉచిత బియ్యం కోసం గొడవపడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉచిత బియ్యం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

డిసెంబరుకు 22,94,202 కిలోల కేటాయింపు 

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిసెంబరు మాసానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లబ్ధిదారులకు 28,43,195 కిలోల బియ్యం అవసరం కాగా రేషన్‌ దుకాణాల వద్ద ఉన్న బియ్యాన్ని పరిగణలోకి తీసుకొని  22,94,202 కిలోలను కేటాయించింది. ఇప్పటికే డీలర్లు తమకు కేటాయించిన కోటాను తీసుకెళ్తున్నారు. జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు, 1,75,501 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 5,08,235 మంది లబ్ధిదారులు ఉన్నారు.  ఆహార భద్రత కార్డులు 1,61,573, అంత్యోదయ కార్డులు 13,694, అన్నపూర్ణ కార్డులు 234 ఉన్నాయి. ఆహారభద్రత కార్డు లబ్ధిదారులు 4,72,313 మంది, అంత్యోదయ లబ్ధిదారులు 35,685 మంది, అన్నపూర్ణ లబ్ధిదారులు 237 మంది ఉన్నారు. వీరికి బియ్యం 28,43,195 కిలోలు అవసరం కాగా నిల్వ బియ్యం 5,48,993 కిలోలు ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ నెల 22,94,202 కిలోల బియ్యాన్ని కేటాయించారు. 


Updated Date - 2021-12-03T06:04:39+05:30 IST