అమ్మఒడిలో అయోమయం!

ABN , First Publish Date - 2022-06-25T08:07:36+05:30 IST

అమ్మఒడిలో అయోమయం!

అమ్మఒడిలో అయోమయం!

కోతలు, వడపోతలతో అస్తవ్యస్తం

జాబితాలో పాత లబ్ధిదారులు మాయం

రెండుసార్లు పొందినా ఈసారి మొండిచేయి

కొత్త దరఖాస్తులకూ నానా కొర్రీలు

జాబితాలో అర్హత.. కానీ ‘ఇన్‌యాక్టివ్‌’ కత్తెర

డాక్యుమెంట్లు పక్కాగాఉన్నా లిస్టులో గాయబ్‌

అసలు కథ ఏమిటనేది సస్పెన్స్‌

సర్కారు వ్యూహం తెలియక సిబ్బందీ అవాక్కు

జాబితా ప్రదర్శనల్లో నిలదీస్తున్న లబ్ధిదారులు


రాష్ట్రంలో అమ్మఒడి పథకం అయోమయంలో పడిపోయింది. ఈ పథకం వర్తింపు ఓ ప్రహసనంగా మారిపోయింది. చదువుతున్న పిల్లలు ఉన్న తల్లులకు ప్రకటించిన సాయం అందేలా రూపొందించాల్సిన నిబంధనలు, చేపట్టాల్సిన ప్రక్రియ చివరకు వారికి పథకాన్ని దూరం చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అర్హులకు సాధారణంగా పథకాలు అందాలి. కానీ, అదృష్టవంతులైన తల్లులకే డబ్బులు పడి... .మిగతావారందరికీ తల్లడింపులు తప్పేలా లేవు..


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

చదువుతున్న పిల్లలు ఉన్న తల్లులకు అందే సాయంలో కోతలు! ఇప్పటికే సాయం అందుకుంటున్న లబ్ధిదారులకూ మళ్లీ మళ్లీ వడపోతలు! దీంతో గతేడాది జాబితాలో కనిపించినవారు తాజా జాబితాలో గల్లంతు! గతంలో సాయం పొందని కొత్త పేర్లెన్నో అనూహ్యంగా లిస్టులో ప్రత్యక్షం! అంతా గందరగోళం! గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అంతా గప్‌చుప్‌! ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. చెప్పేవారు లేరు. గురువారం అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను సచివాలయాల స్థాయిలో ప్రదర్శించారు. అమ్మఒడి పేరుతో ఏటా ఊరిస్తున్న సర్కారు... వడపోతలతో ఎక్కువమంది తల్లులను ఈ జాబితాలోనూ మరోసారి ఉసూరుమనిపించింది. వడపోత కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టడం, పేదలు భగీరధ ప్రయత్నాలు చేసి నిబంధనల మేరకు దరఖాస్తులను భర్తీ చేసినా...వారిని అనర్హులుగానే తేల్చడంతో ఒకరకమైన అయోమయ పరిస్థితి నెలకొంది. అన్నీ అర్హతలు సక్రమంగా ఉండి, వాటిని సమర్పించినవారికి కూడా గుడ్డిగా  అనర్హత వేటు వేయడంలో ఉన్న మతలబు ఏంటో అర్థం కాక సచివాలయ సిబ్బంది సైతం తలలు పట్టుకుంటున్నారు. ఫలానా వారి దరఖాస్తు సక్రమంగా ఉందని, అమ్మఒడికి అర్హులని ఆధారాలతో  గ్రీవెన్స్‌ పెడితే దానిని పరిష్కరించే దిక్కులేదని సిబ్బంది వాపోతున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హత, అనర్హత అనేవి కాకుండా ప్రభుత్వం మరేదో కొలమానంగా పెట్టుకున్నట్లుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితా సచివాలయాలకు చేరిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. జాబితాలో పేరు కనిపించని అర్హులు వారిని తప్పుపడుతూ గొడవకు దిగుతున్నారు. 


తగ్గిన లబ్ధిదారుల సంఖ్య

గత ఏడాది ప్రభుత్వం అనేక వడపోతలు అమలుచేసి చివరకు 44,48,865 మందికి అమ్మఒడి వర్తింపజేసింది. అప్పటికే పలువురు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అర్హులైయినప్పటికీ అకారణంగా ఏదో సాకు చూపి పక్కనపెట్టేశారు. వారినుంచి ఒత్తిడిరావడంతో ఈసారి వారందరితో మళ్లీ దరఖాస్తు చేయించారు. అదే సమయంలో గతంలో ఈ పథకంలో లబ్ధి పొందినవారిని తొలగించే ప్రక్రియ కూడా చేపట్టారు. దీనికోసమే ఆరంచెల వడపోతను తెరపైకి తెచ్చారు. దాదాపు లక్షమందిని ఈ క్రమంలో కోసేశారు. నికరంగా ఈ ఏడాది 43,19,090 మందిని అర్హులుగా తేల్చారు. ఇప్పటికే లబ్ధి పొందుతూ ఈసారి జాబితాలో లేనివారిని పలు సాంకేతిక కారణాలు చూపి సమాధానపరచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకం మంజూరైన లబ్ధిదారుల్లో కూడా కొంతమందిని ఇన్‌ యాక్టివ్‌ కింద చూపించారు. దీని కింద ఉన్న లబ్ధిదారులకు సంబంధించి గ్రీవెన్స్‌ పెట్టినా పరిష్కరించే వ్యవస్థ లేకుండాపోయింది. దీంతో అమ్మఒడి డబ్బులు చేతికొచ్చేదాకా ఎవరికిస్తారో అర్థం కాని పరిస్థితి!


పక్కా డాక్యుమెంట్‌ ఉన్నా..

అమ్మఒడి వర్తింపునకు అడుగుతున్న అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నవారు కూడా కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో వారి ఖాతాలకు ఆధార్‌తో లింక్‌ చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకులకు వెళ్లి వారి అక్కౌంట్లలో ఎన్‌పీసీ చేయించుకున్నా కూడా వారి ఖాతాలు లింక్‌ కాలేదని కొందరికి ఆపేశారు. లింక్‌ అయిందంటూ డాక్యుమెంట్లు గ్రీవెన్స్‌లో పెట్టినా వాటి గురించి పట్టించుకునే వారు లేరని బాదితులు వాపోతున్నారు. కొంతమందికి గతంలో వారి కుటుంబ సభ్యుల పేరుతో కారు ఉందని రిమార్క్‌ వచ్చింది. అయితే వారి పేరున ఎలాంటి కారు లేదని ఏకంగా రవాణశాఖ అధికారుల నుంచి సర్టిఫికేట్‌ తెచ్చి గ్రీవెన్స్‌లో పెట్టినప్పటికీ అమ్మఒడి మంజూరు కాలేదు. పట్టణాల్లో వెయ్యి అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందని కారణంగా చెప్పి  అనర్హులను చేశారు. పట్టణాల్లో తమ పేరున ఉన్న స్థలాన్ని ఎప్పుడో విక్రయించామని, తమ పేరుతో ఏమీ లేదని డాక్యుమెంట్లు సమర్పించినా ఎగ్గొట్టారు. విద్యుత్‌ బిల్లులు 300 యూనిట్లు దాటి ఉంటేవారు అనర్హులు.  ఇంటి మీటర్లు ఆయా ఇంటి ఓనర్ల ఆధార్‌తో లింక్‌ చేయడం ఆనవాయితీ. విచిత్రంగా అమ్మఒడిలో అనర్హుల సంఖ్యను పెంచేందుకు నిబంధనలు మార్చారు. ఆయా ఇళ్లల్లో నివసిస్తున్న అద్దెదారుడి ఆధార్‌తో మీటర్‌ను లింక్‌ చేశారు. దీంతో ఇల్లు మారినప్పుడల్లా ఆయా అద్దెదారుడి ఆధార్‌తో లింక్‌ అయిన  మీటర్ల సంఖ్య పెరిగింది. ఆయా మీటర్ల రీడింగ్‌ ఆధారంగా మరికొందరిని అనర్హులను చేశారు. తమ పేరున మీటర్‌ ఒక్కటే ఉందని విద్యుత్‌శాఖ ఏఈ నుంచి సర్టిఫికేట్‌ సమర్పించినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఒకే రేషన్‌ కార్డులో అమ్మ, బిడ్డ లేరంటూ రిమార్క్‌ చూపిస్తూ పలువురిని అనర్హులను చేశారు. ఇద్దరి ఫొటోలు ఉన్నా రిమార్క్‌ రావడంతో బాధిత తల్లి సచివాలయ సిబ్బందిని నిలదీసింది. 


పరిష్కరించే దిక్కేది?

సచివాలయాల్లో అప్‌లోడ్‌ చేస్తున్న దరఖాస్తుల వరకు తమకు తెలుసని, ఆ తర్వాత ఏమి జరుగుతోందో అంతుబట్టడం లేదని సిబ్బంది చెబుతున్నారు. పలు దరఖాస్తులకు సంబంధించి వచ్చిన రిమార్క్‌లను గ్రీవెన్స్‌ పెట్టాలని ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేశారు. అయితే ఏ గ్రీవెన్స్‌ కూడా పరిష్కారం కావడం లేదంటున్నారు. లబ్ధిదారుల ఫిర్యాదులను పరిష్కరించాలంటే ఎవరికి సిఫారసు చేయాలో అర్థం కావడం లేదని సచివాలయాల ఉద్యోగులు అంటున్నారు. అంతా సక్రమంగా ఉండి పథకం మంజూరైనప్పటికీ కొంతమంది అక్కౌంట్లలో డబ్బులు పడటంలేదు. అలాంటి వారందరి ఖాతాల్లో అదే ఏడాది డిసెంబరులో జమచేస్తామని గతంలో చెప్పారు. అయితే వారికి ఇంతవరకు డబ్బులు పడలేదు. 

Updated Date - 2022-06-25T08:07:36+05:30 IST