నగరి వైసీపీలో వర్గపోరు.. MLA Roja డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు.. ఉద్రిక్త వాతావరణం.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2021-12-21T12:21:01+05:30 IST

నగరి నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు రోజురోజుకూ తీవ్రమవుతూనే ఉంది.

నగరి వైసీపీలో వర్గపోరు.. MLA Roja డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు.. ఉద్రిక్త వాతావరణం.. అసలేం జరిగిందంటే..!

  • పుత్తూరులో ఫ్లెక్సీల రగడ
  • జగన్‌ ఫ్లెక్సీలు చించేశారని.. 
  • రోజావర్గంపై ప్రత్యర్థివర్గం ఆరోపణ, ధర్నా

చిత్తూరు జిల్లా/పుత్తూరు : నగరి నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు రోజురోజుకూ తీవ్రమవుతూనే ఉంది. సీఎం జగన్‌ ఫ్లెక్సీలను ఆదివారం అర్ధరాత్రి చించేసిన సంఘటన సోమవారం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గీయులు ఆదివారం రాత్రి పుత్తూరు పట్టణంలో జగన్‌ పుట్టిన రోజు వేడుకల కోసం దాదాపు రూ.రెండున్నర లక్షల వ్యయంతో 40 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉదయానికల్లా అవి చిరిగిపోయి కన్పించడంతో అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు మీద మాజీ ఎంపీపీ ఏలుమలై ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. అయితే ట్రాఫిక్‌‌కు అంతరాయం అంటూ పోలీసులు అడ్డుకుని ఏలుమలైని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసి రోజా ప్రత్యర్థివర్గంలోని నిండ్ర, నగరి, వడమాలపేట నాయకులు చక్రపాణిరెడ్డి, కేజే కుమార్‌, మురళిరెడ్డిలతో పాటు నాయకులు రవిశేఖర్‌రాజు, నారాయణబాబు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకున్నారు. తమ పార్టీ నాయకుడు జగన్‌ ఫ్లెక్సీలను చించేసింది, ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరినవారి పనే అయివుంటుందని అనుమానం వ్యక్తం చేశారు.


రెండున్నర లక్షలతో నాలుగు రోజులు కష్టపడి ఏర్పాటు చేసిన 40 ఫ్లెక్సీలను పాడు చేయడం అన్యాయమని ఆరోపించారు. పట్టణంలో వున్న సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే రోజా డౌన్‌ డౌన్‌ నినాదాలతో కాస్త ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అనంతరం స్టేషన్‌ బయట ఆర్‌.చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనకు తెలిసినంత వరకు టీడీపీ అధికారంలో వున్నప్పుడు ఇలాంటివి జరగలేదన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. నగరి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కేజే కుమార్‌ మాట్లాడుతూ బియ్యం, గంజాయి, ఇసుక, రెడ్‌ శాండల్‌ స్మగ్లర్లు తమ పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపంచారు. అబద్ధం అని వాళ్లను చెప్పమనండి అని సవాలు విసిరారు. ‘ఫ్లెక్సీలను టీడీపీ నుంచి వచ్చిన వారే చించారు. వైసీపీ వాళ్లు జగన్‌ ఫ్లెక్సీలను చించరు. ఇలాంటి వాటిని ఎమ్మెల్యే ఖండించాలి’ అని ఏలుమలై డిమాండ్‌ చేశారు. జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాల్సిన తరుణంలో ఇలా జరగడం విచారకరమన్నారు.



Updated Date - 2021-12-21T12:21:01+05:30 IST