Abn logo
Sep 25 2021 @ 00:29AM

వైసీపీలో.. రగడ!

హిరమండలంలో ఇరువర్గాలను అదుపు చేస్తున్న పోలీసులు

- ఎంపీపీ ఎన్నికల్లో బయటపడిన వర్గ విభేదాలు

- అధిష్టానం ఆదేశాలు లెక్క చేయని నేతలు

- పొందూరు, సంతబొమ్మాళిలో నిలిచిన ఎన్నికలు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. శుక్రవారం జిల్లాలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నేతల్లో సమన్వయం కొరవడడం,  ముఖ్య నేతల ఆదేశాలను సైతం పార్టీ శ్రేణులు పట్టించుకోకపోవడం వంటి సంఘటనలు వెలుగు చూశాయి.  పలుచోట్ల మండలాధ్యక్ష, ఉపాఽధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు రచ్చ రచ్చగా మారాయి.  ఎంపీపీ పదవుల విషయంలో ఎమ్మెల్యేల సామాజిక వర్గానికి కాకుండా.. మరో వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈ ఆదేశాలను పలు చోట్ల వైసీపీ నేతలు ధిక్కరించి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మండల స్థాయిలో నాయకులు కూడా పార్టీలో జిల్లా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల మాట వినకుండా ఎవరికివారే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కొందరు పరస్పరం వాగ్వాదానికి, విమర్శలకు దిగారు. మరికొన్నిచోట్ల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఈ క్రమంలో ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఎన్నికలు సాగాయి. 

- పొందూరు, సంతబొమ్మాళి మండలాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి.  అక్కడ అధ్యక్ష పదవుల కోసం వైసీపీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా ఎంపీటీసీ సభ్యులు మరొక అభ్యర్థిని ఎన్నుకొనేందుకు సిద్ధమవడం వివాదాస్పదంగా మారింది.

- ఎచ్చెర్ల ఎంపీపీ పదవి కోసం రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలు చేశాయి. దీంతో అధిష్ఠానం చేసేది లేక, ఐదేళ్ల పదవీ కాలాన్ని ఇద్దరికీ చెరిసగం పంచేసింది. 

- టెక్కలి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు ఇద్దరు వైసీపీ నేతల మధ్య అధిపత్య పోరుకు వేదికయ్యాయి.

- నందిగాం మండలంలో అధిష్టానం బీఫారం ఇచ్చిన అభ్యర్థిని కాకుండా ఎంపీటీసీ సభ్యులు నడుపూరు శ్రీరామ్మూర్తిని ఎన్నుకున్నారు. నందిగాం మండలంలో ఒక నియోజకవర్గ స్థాయి నేత ఉండగా... మరొక నేత ఆ మండలంలో వేలు పెట్టడంతో ఎంపీపీ ఎన్నికను ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరకు నందిగాం మండలానికి చెందిన వైసీపీ నేత మాట నెగ్గింది. 

- పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటకు లెక్కలేకుండా పోయింది. మెళియాపుట్టిలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి నిర్ణయించిన వ్యక్తిని కాదని ఎంపీటీసీలు ఎంపీపీగా ఈశ్వరమ్మను ఎన్నుకున్నారు. 

- హిరమండలంలో కూడా ఎమ్మెల్యే వర్గానికి చుక్కెదురైంది. రెబల్‌ అభ్యర్థికే పదవి సొంతమైంది.

- కొత్తూరులోనూ అధిష్టానం బీఫారం ఇచ్చిన వ్యక్తిని కాదని, వైస్‌ ఎంపీపీగా తులసి వరప్రసాద్‌ను ఎన్నుకున్నారు. వైసీపీలో రెండు వర్గాలు ఎంపీపీ పదవి కోసం వాదోపవాదాలకు దిగారు. ఈ తతంగమంతా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలోనే జరగడం గమనార్హం.  మొత్తమ్మీద ఎంపీపీ ఎన్నికల వేళ.. వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.  


పదవి దక్కలేదని.. రాజీనామా

టెక్కలి: టెక్కలి ఎనిమిదో ప్రాదేశికం ఎంపీటీసీ సభ్యురాలు దేవాది శాంతామణి తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ పదవి దక్కకపోవడంతో నిరాశ చెంది ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె భర్త దేవాది గోపితో కలిసి రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ మంచు కరుణాకర్‌కు రాజీనామా ప్రతులను అందజేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ‘అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేశా. 2013లో టెక్కలి సర్పంచ్‌ స్థానం ఎస్సీ(మహిళ)కి కేటాయించడంతో ఎవరూ పోటీకి ముందుకురాలేదు. ఆ సమయంలో నేను పోటీచేసి ఓటమి చెందాను. ఆర్థికంగా చాలా నష్టపోయాను. 2014లో ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏఎంసీ చైర్మన్‌ ఎస్సీకి కేటాయించినా.. నాయకులు నాకు అవకాశం కల్పించలేదు. ఈసారి టెక్కలి ఎంపీపీ స్థానం కోసం నియోజకవర్గ ఇన్‌చార్జి వద్ద హామీ పొంది ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ  చేశాను. ఎనిమిదో ప్రాదేశికం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొందాను. ఆ సమయంలోనే నన్ను ఓడించేందుకు రెబల్‌ అభ్యర్థులను బరిలోకి దించారు. అయినా ఎంపీటీసీగా విజయం సాధించా. ఇప్పుడు ఎంపీపీ పదవి నాకు ఇవ్వకుండా.. కొంతమంది పెద్దలు మరొకరికి అవకాశం కల్పించారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడినా గుర్తించలేదు. ప్రజాసేవ చేయాలని భావించినా.. అవకాశం ఇవ్వలేదు. నేను చేసిన తప్పేంటి?’ అని కొందరు నాయకులను పరోక్షంగా ప్రశ్నించారు. తనలా మరొకరికి అన్యాయం జరగరాదని, సీఎం జగన్‌ దృష్టికి ఈ విషయం వెళ్లాలనే ఉద్దేశంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశానని విలపిస్తూ వెల్లడించారు.