విజయవాడ: ఒకప్పుడు ఆ ఇద్దరు నాయకులు జిగిరీ దోస్తులు.. ఏ పార్టీలో ఉన్నా తమ స్నేహాన్ని మాత్రం వదులుకునే వారు కారు. స్నేహానికి చిహ్నంగా ఉన్న వారి మధ్య ప్రస్తుతం ఏం జరిగింది. ఎందుకు ఎడమొహం.. పెడమొహంగా ఉన్నారు.. ఎవరికి వారుగా ఉంటూ ఏం కార్యక్రమంలోనూ ఎందుకు కలవడం లేదు.. గుడివాడలో ప్రస్తుతం రాజకీయ నేతలు, ప్రజల్లో ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి.
వంగవీటి రాధా, కొడాలి నాని మధ్య ఇటీవల దూరం పెరిగింది. గుడివాడలో ప్రస్తుతం వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది. ఏ పార్టీలో ఉన్నా.. గతంలో వీరి మధ్య స్నేహం కొనసాగుతూ వచ్చింది. అయితే రెండేళ్లుగా వీరిద్దరూ.. ఎవరికి వారు అన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. గుడివాడలో రాధా ఒంటరి పర్యటనలు చేస్తన్నారు. దీనిపై స్థానికుల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అలాగే తరచూ రాధ.. గుడివాడ పర్యటనలు చేస్తుండడంపై రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కాపు సామాజికవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న కార్యకమమైనా హాజరవుతున్నారు. ఇటీవల గుడివాడలో నానిని పట్టించుకోకుండా రాధా.. పర్యటనలు కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల ఎక్కడా కలవకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నాని తీరుపై గుడివాడ కాపు సామాజికవర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొత్తానికి గుడివాడలో ప్రస్తుతం కొడాలి నాని, వంగవీటి రాధ.. అంశం హాట్ టాపిక్‌గా మారింది.