Abn logo
Jul 27 2021 @ 00:10AM

పార్వతీపురం వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

ఎమ్మెల్యే జోగారావును ప్రశ్నిస్తున్న ప్రసన్నకుమార్‌ అభిమానులు

  రసాభాసగా టీడ్కో చైర్మన్‌ జమ్మాన సన్మాన సభ

  రెండు వర్గాలుగా విడిపోయిన శ్రేణులు

పార్వతీపురం టౌన్‌, జూలై 26: పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు తీవ్రమైంది. ఇందుకు టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ సన్మాన సభ వేదికైంది. ఇటీవల నామినేటెడ్‌ పదవుల్లో భాగంగా జమ్మానకు టిడ్కో చైర్మన్‌ పదవి దక్కిన సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన పార్వతీపురం విచ్చేశారు. ఆయన అభిమానులు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం జమ్మాన ప్రసన్న కుమార్‌ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ఎమ్మెల్యేకు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి బాగాలేదంటూ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే జోగారావు స్పందించారు. నేనేం తప్పుచేశానంటూ ప్రశ్నించారు. దీంతో చినికిచినికి గాలివానలా వివాదమైంది. ఇంతలో ఎమ్మెల్యేకు మద్దతుగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, కౌన్సిలర్లు అండగా నిలిచారు. ఎమ్మెల్యే జోగారావు, జమ్మాన ప్రసన్నకుమార్‌ ఇరు వర్గాలుగా విడిపోయి కేకలు వేసుకున్నారు. సమావేశానికి పిలిచి అవమానించారంటూ ఎమ్మెల్యే జోగారావు కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై ప్రసన్నకుమార్‌ విచారం వ్యక్తం చేశారు.