మోదం.. ఖేదం..!

ABN , First Publish Date - 2022-01-28T05:44:00+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా చేస్తూ.. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రతిపాదించారు. అదే జిల్లాలో భిన్న పరిస్థితులకు వేదికైంది. 117 ఏళ్లుగా రెవెన్యూ డివిజన కేంద్రంగా.. 65 ఏళ్లుగా పార్లమెంట్‌ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారు..? అనేది ఆ ప్రాంత వాసుల వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టారు.

మోదం.. ఖేదం..!
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించనందుకు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

అన్నమయ్య జిల్లా కేంద్రం ప్రకటనపై...

రాజంపేటలో రాజకీయ పక్షాల ఆందోళన బాట

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన వైసీపీ నాయకులు

ఓ కీలక నేత ఫోన్లో బుజ్జగింపులు.. బెదిరింపులు ?

రాయచోటిలో అభినందన ర్యాలీలు

జిల్లాలో భిన్న పరిస్థితులు

(కడప-ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా చేస్తూ.. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రతిపాదించారు. అదే జిల్లాలో భిన్న పరిస్థితులకు వేదికైంది. 117 ఏళ్లుగా రెవెన్యూ డివిజన కేంద్రంగా.. 65 ఏళ్లుగా పార్లమెంట్‌ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారు..? అనేది ఆ ప్రాంత వాసుల వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టారు. ఆరు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండేలా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం సరైన నిర్ణయమని, ఈ ప్రాంతం జిల్లా కేంద్రమైతే తప్పేంటి..? అనేది ఈ ప్రాంత ప్రజల వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ కృతజ్ఞత ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెలో సైతం తమ ఊరినే జిల్లా కేంద్రంగా చేయాలంటూ నిరసనలు తెలిపారు.


రాజంపేటలో రోడ్డెక్కిన రాజకీయ పక్షాలు

రాజంపేటను రెవెన్యూ డివిజన కేంద్రంగా 1905లో నాటి బ్రిటీష్‌ ఏలికలు ఏర్పాటు చేశారు. అంటే.. డివిజనగా ఏర్పడి 117 ఏళ్లు. 1957నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గంగా కొనసాగుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రాజంపేట జిల్లా కేంద్రంగా ఉంటుందని ఆ ప్రాంతవాసులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. దీనికి భిన్నంగా సీఎం జగన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆ ప్రాంతవాసులను పోరుబాట పట్టించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార వైసీపీ నాయకులే ముందుండి ఆందోళనలు చేయడం.. జగన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాబోయే ఎన్నికల్లో రాజంపేట, రైల్వేకోడూరులో ఓటమి తప్పదని బాహాటంగా ప్రకటించడం కొసమెరుపు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని వైసీపీకి చెందిన మున్సిపల్‌ చైర్మన పోలా శ్రీనివాసులరెడ్డి, వైస్‌ చైర్మన మర్రి రవి, వైస్‌ ఎంపీపీ ఆకేపాటి రంగారెడ్డిల ఆధ్వర్యంలో గురువారం రోడ్డెక్కారు. వీరికి అఖిలపక్ష నేతలు మద్దతు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా జిల్లా కేంద్రం సాధన కోసం చేపట్టిన ఆందోళన లతో రాజంపేట పట్టణ వీధులు హోరెత్తాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన ఆకేపాటి అమర నాథ్‌రెడ్డి ప్రత్యేక్ష ఆందోళనలో పాల్గొనకపోయినా.. తెర వెనక ఉండి తమ అనుచరులతో జిల్లా సాధన ఆందోళనలు చేయిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. సీఎం జగన తీసుకున్న నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారా..? పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమేంటి..? పద్ధతి మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు రాజంపేట వైసీపీ నాయకులకు ఫోన చేసి బుజ్జగింపులు, బెదిరింపులకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం.


రాయచోటిలో అభినందన ర్యాలీలు

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటిస్తూ నోటిఫికేషన జారీ చేయడంపై ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం జగనకు మద్దతు, కృతజ్ఞతలు చెబుతూ  గురువారం ర్యాలీ చేశారు. మున్సిపల్‌ చైర్మన ఫయాజ్‌, వైస్‌ చైర్మన ఫయాజూర్‌ రహిమాన, రాయచోటి జడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన అన్వర్‌బాషా, పీఆర్‌టీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, కౌన్సిలర్లు మదనమోహనరెడ్డి, కో-ఆప్షన సభ్యుడు ఆసీఫ్‌అలీఖాన, కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఇన్నాళ్లకు రాయచోటికి తగిన గుర్తింపు ఇచ్చారని, అన్నమయ్య జిల్లా  పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలకు అనుకూలంగా జిల్లా కేంద్రం ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉందంటూ కొనియాడారు. జిల్లా కేంద్రం రావడంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంతరెడ్డి కృషి ఎంతో ఉందని కొనియాడారు. మరో పక్క రాయచోటి జిల్లా సాధన సమితి కన్వీనర్లు డాక్టరు బయారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు వై.నాగిరెడ్డిల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ ప్రాంతాన్నే ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలి..? ఇక్కడ ఉన్న అనుకూలతలు, సౌకర్యాలు.. తదితర వివరాలతో గతంలో ప్రభుత్వ పెద్దలకు, ఉన్నత అధికారులకు పంపిన వంద పేజీల నివేదికపై ప్రధానంగా చర్చించారు. కాగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని అక్కడ ఆందోళన బాట పట్టారు. ఒక జిల్లా ఏర్పాటు ప్రతిపాదన అదే జిల్లా పరిధిలో మూడు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులకు వేదిక కావడం కొసమెరుపు. 


మౌలిక వసతుల కల్పనపై అధికారుల కసరత్తు 

ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచే పాలన ప్రారంభం అవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా పాలనకు అసరమైన మౌలిక వసతులపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఓ ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రైవేటు పాఠశాల భవనం, ప్రభుత్వ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సరిపడ ప్రైవేటు భవనాల (విల్లా)ను గుర్తిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. రాయచోటి పరిసరాల్లో సుమారు 350-400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఇప్పటికే గుర్తించారని, శాశ్వత కలెక్టరేట్‌ ఏర్పాటుకు వీలుగా ఒకేచోట 80-100 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూములు కూడా గుర్తించినట్లు సమాచారం. అలాగే.. రాయచోటికి అతి సమీపంలో ఉండే మండలాలను కలుపుతూ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేసేలా భూములు గుర్తిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు.


అన్ని సౌకర్యాలు ఉన్న రాజంపేటను కాదని..

రాజంపేటలో సబ్‌ కలెక్టరు కార్యాలయంతో పాటు అన్ని శాఖల డివిజన కార్యాయాలు ఉన్నాయి. 14 ఎకరాల్లో ఆర్డీవో ఆఫీసు, 15 ఎకరాల్లో ఆర్టీసీ ప్రాంగణం ఉంది. డివిజన కార్యాలయాల బోర్డులను జిల్లా కార్యాలయాలుగా మార్చేసి ఒక్క పైసా ఖర్చు లేకుండా తక్షణమే పాలన సాగించేలా ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. పట్టణ శివారులో జిల్లా కేంద్రం అభివృద్ధికి వీలుగా వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని రాజంపేట వాసులు పేర్కొంటున్నారు.


రాజంపేటలో ర్యాలీ 

తాళ్లపాకలో వైసీపీ నేతల అర్ధనగ్న ప్రదర్శన,

రాజంపేట, జనవరి 27: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం పట్ల వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజంపేటలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఆయా పాఠశాలల నుంచి పాతబస్టాండు వరకు ర్యాలీ నిర్వహించి రాజంపేటను జిల్లా కేంద్రం చేసి తీరాలని నినాదాలు చేశారు. మున్సిపల్‌ చైర్మన పోలా శ్రీనివాసులరెడ్డి, రాజంపేట మండల ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, రాజంపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన మర్రి రవి, వైసీపీ మండల మహిళా కార్యదర్శి మిరియాల సురేఖ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. అఖిలపక్ష నేతలు వీరికి మద్దతు పలికారు. టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ప్రతా్‌పరాజు, బీసీ సంఘ నాయకులు ఇడమడకల కుమార్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు శివ, మహేష్‌ (సీపీఐ), చిట్వేలి రవికుమార్‌ (సీపీఎం), పూల భాస్కర్‌ (కాంగ్రెస్‌) తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య పేరిట రాయచోటిని జిల్లాగా ప్రకటించడం అన్నమయ్యను అవమానించినట్లేనని పేర్కొన్నారు. అన్ని వనరులున్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేశారు.


తాళ్లపాకలో: అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో వైసీపీకి చెందిన ప్రధాన నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తాళ్లపాక గ్రామ నాయకులు, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన వైసీ యోగీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. సర్పంచ గౌరీ శంకర, ఎంపీటీసీ మధుసూధనవర్మ తమ మెడలకు ఉరితాళ్లు వేసుకొని కచ్చితంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ డిమాండ్‌ చేశారు. రాయచోటి వద్దు - రాజంపేట ముద్దు, రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి... అంటూ నినాదాలు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, అన్నమాచార్య విద్యాసంస్థల వైస్‌ చైర్మన చొప్పా యల్లారెడ్డి, వైసీపీ నేత కొండూరు శరతకుమార్‌రాజు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ కూండ్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అన్నమయ్య జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు, జనాభా వివరాలు 

నియోజకవర్గం ఓటరు జనాభా (సుమారుగా)

రాయచోటి 2,43,889 3,29,250

రాజంపేట 2,30,807 3,11,590

రైల్వేకోడూరు 1,93,228 2,60,850

మదనపల్లె 2,56,835 3,46,725

పీలేరు 2,29,595 3,09,950

తంబళ్లపల్లె 2,16,316 2,92,025

================================

మొత్తం 13,70,670 18,50,390

------------------------------------------------------


కడప పేరు తొలగిస్తే ఉద్యమమే : లింగారెడ్డి 

కడప, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘తిరుమల తొలిగడపగా కడప విరాజిల్లుతోంది.  బ్రిటీష్‌ కాలం నుంచే కడపకు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కడప పేరును తొలగించి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జిల్లాగా నామకరణం చేయడం వల్ల జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతీసినట్లే. ప్రభుత్వం కడప పేరును కొనసాగించకపోతే ప్రజా ఉద్యమం చేపడతాం’’ అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి హెచ్చరించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న కడప జిల్లా పేరును తొలగించడం అన్యాయమన్నారు. జగన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా వాసులను కడప పేరు మార్చి మానసిక క్షోభకు గురి చేయవద్దని సూచించారు. ఏడుకొండల వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసని, అలాంటి తిరుమల తొలి గడప అయిన కడప పేరును మారిస్తే సహించేది లేదన్నారు. ఉద్యోగస్తులకు నెల నెలా జీతాలు ఇచ్చేందుకే దిక్కు లేదని, అలాంటప్పుడు కొత్త జిల్లాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు బి.హరిప్రసాద్‌, ఎస్‌.గోవర్ధనరెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత లక్ష్మిరెడ్డి, మీడియా కోఆర్డినేటర్‌ జనార్ధన పాల్గొన్నారు.




Updated Date - 2022-01-28T05:44:00+05:30 IST