భూ తగాదాతో ఇరువర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2021-06-19T06:09:50+05:30 IST

ఓ వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దాడిలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో చోటుచేసుకున్నది.

భూ తగాదాతో ఇరువర్గాల ఘర్షణ
మృతిచెందిన శ్రీనివాస్‌, వివాదాస్పద భూమిలో దాడికి వినియోగించిన గొడ్డలి, కర్రలు

దాడికి పాల్పడిన వారి ఇళ్లపై బాధిత బంధువుల దాడి 

హత్యకు గురైన వ్యక్తి కుటుంబీకులను విచారించిన డీఎస్పీ కిరణ్‌కుమార్‌

మెదక్‌ జిల్లా శాలిపేటలో ఘటన

గ్రామంలో ఉద్రిక్తత, పోలీస్‌ పికెటింగ్‌


చిన్నశంకరంపేట, జూన్‌ 18 : ఓ వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దాడిలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిపేట గ్రామానికి చెందిన మూర్తి శివరాములు కొడుకు నారాయణ అదే గ్రామానికి చెందిన కేసరి పెంటయ్య వద్ద 637 సర్వే నంబర్‌ గల 18 గుంటల భూమిని కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. నారాయణ, అతని తమ్ముళ్లు ఆ భూమి తమదే అని.. ‘మీకు పట్టా ఉందా? మీ భూమి ఎట్లయితది’ అంటూ పెంటయ్య కొడుకులతో కొంతకాలంగా గొడవ పడుతున్నారు. గొడవ కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి కేసరి పెంటయ్యదేనని కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. శుక్రవారం కేసరి పెంటయ్య కొడుకులు శ్రీనివాస్‌, రాజు, సత్యనారాయణ తమ భూమిలో మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు భూమిని చదును చేసుకుంటున్నారు. భూ వ్యవహారంలో క్షక్షసాధింపునకు పూనుకున్న నారాయణ అతని తమ్ముళ్లు రాజయ్య, యాదగిరి, రఘుపతితో పాటు మరికొంతమంది పెంటయ్య కొడుకులతో ఘర్షణకు దిగారు. అనంతరం గొడ్డలి, కర్రలతో దాడి చేసి వెంబండించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇరువర్గాల దాడిలో పెంటయ్య కొడుకులు శ్రీనివాస్‌, రాజు, సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రాజును కాపాడేందుకు వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌ ఇంట్లో దాచారు. రాజును బయటకు పంపాలంటూ నిందితులు సత్యనారాయణగౌడ్‌ను హెచ్చరించారు. కాసేపటికి వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌(38)ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండండంతో ఆసుపత్రిలో చేర్పించారు. మృతుడు శ్రీనివా్‌సకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి, హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 

నిందితుల ఇళ్లపై దాడి

శ్రీనివాస్‌ చనిపోయిన విషయం తెలుసుకున్న అతని బంధువులు నిందితుల ఇళ్లపై దాడి చేశారు. టీవీ, బీరువా, ఫర్నిచర్‌, బోరుబావి పైపులను ధ్వంసం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వారి ఇంటి ఎదుట బాధితుల బంధువులు ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. తూప్రాన్‌ డీఎస్పీ, ఎస్‌ఐలు బలగాలతో గ్రామానికి చేరుకుని పికెటింగ్‌ నిర్వహించారు. డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వివాదాస్పాద భూమిని పరిశీలించారు. దాడికి ఉపయోగించిన రెండు గొడ్డళ్లను, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఘర్షణలో మృతిచెందిన కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హత్యకు పాల్పడిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. గ్రామంలో మూడు రోజులపాటు పికెటింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.  పోలీసు బందోబస్తు మధ్య శ్రీనివాస్‌ అంత్యక్రియలు నిర్వహించారు.  



Updated Date - 2021-06-19T06:09:50+05:30 IST