సమతావాదాల సంఘర్షణ

ABN , First Publish Date - 2020-11-10T05:51:30+05:30 IST

ఫ్రాన్స్‌లో ఒక ఉపాధ్యాయుని శిరచ్ఛేదం ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పట్ల అసహనాన్ని ప్రజ్వలింప చేసింది. అయితే ఇది పాక్షిక దృష్టి...

సమతావాదాల సంఘర్షణ

పాశ్చాత్య భావజాలంతో పోల్చితే ఇస్లామ్ చింతనా ధోరణుల్లో మార్పులు సంభవించలేదు. ప్రవక్త ముహమ్మద్ నెలకొల్పిన సంప్రదాయాలు అనుల్లంఘనీయమైనవని ముస్లింలు విశ్వసిస్తున్నారు. మానవాళి వినూత్న మార్గాలలో ముందుకు సాగుతోంది. మారుతున్న భావాలు, మారని విశ్వాసాల నడుమ అంతరాలే ఇస్లాం, పాశ్చాత్య సమాజాల మధ్య సంఘర్షణకు మూల కారణాలు.


ఫ్రాన్స్‌లో ఒక ఉపాధ్యాయుని శిరచ్ఛేదం ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పట్ల అసహనాన్ని ప్రజ్వలింప చేసింది. అయితే ఇది పాక్షిక దృష్టి మాత్రమే. నిజానికి ఇస్లామ్‌లోనూ, పాశ్చాత్య భౌతికవాద భావజాలంలోనూ సంస్కరణల అవసరం ఎంతైనా ఉంది. ఇస్లాం, పాశ్చాత్య భావజాలాలు రెండూ మౌలికంగా సమతావాదాలే. 


క్రీ.శ. 6వ శతాబ్ది అరబ్ సమాజంలో అమానుష అసమానతలు ఉండేవి. అతికొద్దిమంది శిష్ట జనులు అ‍ష్టైశ్వర్యాలతో తులతూగుతుండేవారు. అసంఖ్యాక ప్రజల బతుకులు బానిసత్వంలో మగ్గిపోతుండేవి. ఆ దుర్భర పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ ఆవిర్భవించారు. సకల మానవులూ సమానులేనన్న విప్లవాత్మక సందేశంతో అరబ్‌ల జీవితా లలో ఆయన కొత్త కాంతులను ప్రసరింపజేశారు. ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనేవి 1789 ఫ్రెంచ్ విప్లవ ఉద్ఘోషలు. అయితే కాల క్రమంలో ఇస్లాం, ఫ్రెంచ్ సమతావాద చింతనలు, ఆచరణలు భిన్న దిశల్లో పరిణమించాయి. 


ఇస్లాం ధర్మాలను వ్యాఖ్యానించి, విపులీకరించే బాధ్యతను ప్రవక్త అనంతరం ‘సున్నత్’ చేపట్టింది. ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంహితే ‘సున్నత్’. తొలి ఇద్దరు ఖలీఫాల అనంతరం ఇస్లాం మత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ‘ఆఫ్టర్ ది ప్రాఫెట్’ గ్రంథ రచయిత లెస్లీ హెజెల్టన్ పేర్కొన్నారు. మూడో ఖలీఫా కాలంలో సమతావాద ప్రబోధాలు, ఆచరణలు బలహీనపడ్డాయి. అసమానతలు మళ్ళీ పెచ్చరిల్లడం ప్రారంభమయింది. ప్రవక్త బోధనలకు విరుద్ధమైన ఆచరణలు స్థిరపడ్డాయి. పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రబోధాలకు బాష్యాలు చెప్పి, విపులీకరించే బాధ్యత ఖలీఫాలదే కావడం వల్ల కొత్త పరిణామాలు అనివార్యంగా ఆమోదాన్ని పొందాయి. భాష్యాల కాఠిన్యం మత అనుష్ఠానాలను అమితంగా ప్రభావితం చేసింది. 


ముహమ్మద్ ‘చివరి ప్రవక్త’ అని ఖురాన్ పేర్కొంది. అయితే ఈ మాటను రెండు విధాలుగా అర్థం చేసుకోవడం జరిగింది. అప్పటిదాకా అంటే ముహమ్మద్ కాలం వరకు వచ్చిన ప్రవక్తలలో ఆయనే ఆఖరివాడు అని కొంతమంది భావించగా, ఆగామి కాలానికి కూడా ఆయనే ఆఖరివాడని మరి కొంతమంది విశ్వసించారు. ముహమ్మదే, ఆగామి కాలానికి ఆఖరి ప్రవక్త అని సున్నత్ స్పష్టం చేసింది. దీంతో ప్రవక్త సుభాషితాలకు సున్నత్ వ్యాఖ్యానాలు నిర్ణీతమైనవని, అవి ఎవరూ ఎటువంటి మార్పు చేయలేనివనే సంప్రదాయం బలంగా ఏర్పడింది. కాలవాహినిలో ప్రపంచం పెనుమార్పులకు లోనయింది. అయితే ఇస్లాం అనుయాయుల విశ్వాసాలు సుదృఢంగా ఉండిపోయాయి. 


పాశ్చాత్య ప్రపంచంలోనూ క్రైస్తవమతం ఒకప్పుడు ప్రజలను, వారి జీవితాలను అమితంగా ప్రభావితం చేసేది. క్రైస్తవులలోని వివిధ శాఖల వారి మధ్య సామరస్యం ఉండేది కాదు. పరస్పరం హతమార్చుకునేవారు. క్రీస్తుశకం మొదటి సహస్రాబ్దిలో ఈ ధోరణులు తీవ్రంగా ఉండేవి. ఇస్లాం ప్రభవ ప్రాభవాలతో క్రైస్తవేతరులపై క్రైస్తవులలో వ్యతిరేకత ప్రబలింది. ఆ మత సమాజాలలో క్రైస్తవేతరులను ద్వితీయ స్థాయి పౌరులుగా పరిగణించేవారు. ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులు శతాబ్దాల తరబడి యుద్ధాలు చేశారు. 


1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం సామాజిక, రాజకీయ ధార్మిక వ్యవస్థలలో మౌలిక మార్పులు తెచ్చింది. మతంతో ఎటువంటి ప్రమేయం లేని రాజ్యవ్యవస్థను నెలకొల్పింది. పౌరులు అందరూ సమానులే అనే భావనను నెలకొల్పింది. ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనే ఆదర్శాలను సకల మానవులకూ నిర్దేశించింది. అవి సమున్నతమైనవ నడంలో సందేహం లేదు. అయితే ఫ్రెంచ్ ప్రజలు వాటిని ఇతర దేశాల ప్రజల విషయంలోనూ చిత్తశుద్ధితో ఆచరించారా? లేదు. 


ఫ్రాన్స్ 19వ శతాబ్దిలో వాయువ్య ఆఫ్రికా దేశాలను ఆక్రమించి తన వలసపాలనను నెలకొల్పింది. ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాలకు విరుద్ధంగా భయానక పద్ధతులలో పాలన చేసింది. ఆ దేశాల సహజవనరులను పూర్తిగా కొల్లగొట్టింది. ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా చూసి వారికి ఎలాంటి హక్కులు లేకుండా చేసింది. సమానత్వం అనే ఫ్రెంచ్ ఆదర్శం ఆఫ్రికాలో ఎందుకూ కొరగానిదైపోయింది. 


ఇరవయో శతాబ్ది ద్వితీయార్ధంలో వలసపాలనా యుగం ముగిసిన అనంతరం ఫ్రెంచ్ బహుళజాతి కంపెనీలు అభివృద్ధిచెందుతున్న దేశాలను దోపిడీ చేయడాన్ని కొనసాగించాయి. నిజానికి మరింత తీవ్రతరం చేశాయి. సమానత్వం, సౌభ్రాతృత్వమనే ఆదర్శాలు పూర్తిగా ఫ్రెంచ్ సమాజానికి మాత్రమే పరిమితమైపోయాయి. ఫ్రాన్స్ వెలుపల నివసించే వారిని ఫ్రెంచ్ పౌరులతో సమానంగా పరిగణించడం జరగలేదు. ఇక వారి విషయంలో సౌభ్రాతృత్వాన్ని ఎలా పాటిస్తారు? మహోన్నత విప్లవ ఆదర్శాలు వాస్తవానికి విలుప్తమైపోయాయి. 


ఇస్లాం, పాశ్చాత్య ప్రపంచ ఆదర్శాలు సమున్నతమైనవే అయినా ఆచరణలో అమానుషకరంగా పరిణమించాయి. సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని భిన్న విధాలుగా నిరాకరించాయి. అయితే పాశ్చాత్య ప్రపంచం తన పద్ధతులు మార్చుకుంది. ఒకప్పుడు వలసపాలన ప్రబలంగా ఉండేది. ఫ్రాన్స్, ఇతర పశ్చిమ యూరోపియన్ దేశాలు ఈ ధరిత్రిపై తమ వలసలుగా చేసుకోని దేశమంటూ లేదు. అయితే ఇప్పుడు అదంతా గతం. 


పాశ్చాత్య భావజాలంతో పోల్చితే ఇస్లామ్ చింతనా ధోరణుల్లో సంస్కృతిలో మార్పులు సంభవించలేదు. ముహమ్మద్‌ను చివరి ప్రవక్తగా గౌరవిస్తున్నారు. ఆయన ప్రబోధాలను పరిపూర్ణంగా అనుసరిస్తున్నారు. ఆయన నెలకొల్పిన సంప్రదాయాలు అనుల్లంఘనీయమైనవని విశ్వసిస్తున్నారు. అయితే మానవాళి వినూత్న మార్గాలలో ముందుకు సాగుతోంది. మారుతున్న భావాలు, మారని విశ్వాసాల నడుమ అంతరాలే ఇస్లాం, పాశ్చాత్య సమాజాల మధ్య సంఘర్షణకు మూల కారణాలు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-11-10T05:51:30+05:30 IST