పలుచోట్ల వాగ్వాదం.. ఘర్షణ

ABN , First Publish Date - 2021-10-17T05:11:17+05:30 IST

చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన దసరా వేడుకల్లో కొబ్బరికాయ పంచాయితీ ఉద్రిక్తతకు దారితీసింది.

పలుచోట్ల వాగ్వాదం.. ఘర్షణ
మోత్కూరు మండలంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఘర్షణ

చౌటుప్పల్‌లో కొబ్బరికాయ కొట్టనీయలేదని ఆగ్రహం 

చౌటుప్పల్‌ టౌన్‌, అక్టోబరు 16: చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన దసరా వేడుకల్లో కొబ్బరికాయ పంచాయితీ ఉద్రిక్తతకు దారితీసింది. మునిసిపల్‌ చైర్మన్‌ వైఖరిని నిరసిస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కచ్చీర్‌ వద్ద మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  శమీ పూజల్లో చైర్మన్‌ మాతమ్రే కొబ్బరి కాయ కొట్టేందుకు అవకాశం కల్పించారు. గతంలో  గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు శమీ పూజ వద్ద కొబ్బరి కాయలు కొట్టేవారు. అదేవిధంగా మునిసిపాలిటీ పాలకవర్గం ఏర్పాటు జరిగిన అనంతరం గతేడాది దసరాకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కొబ్బరికాయలు కొట్టారు. ఈ సారి మాత్రం చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు ఒక్కరే కొబ్బరికాయను కొట్టి పూజను ముగించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం చేత కొబ్బరికాయ కొట్టించాలని స్థానికులు పట్టుబట్టారు. అది వినకుండా చైర్మన్‌ సమీపంలోని జమ్మికొమ్మ వద్దకు వెళ్లి, అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేందుకు  ప్రయత్నిస్తుండగా కొంతమంది అడ్డుతగిలారు. అదే సమయంలో వైస్‌ చైర్మన్‌ శ్రీశైలం గౌడ్‌ వెళ్లి ప్రజలకోర్కె మేరకు కొబ్బరికాయ కొట్టారు. అనంతరం పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమనిగింది. 


ధర్మాపురంలో రెండు వర్గాల మధ్య తోపులాట

మోత్కూరు: మునిసిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలో దసరా వేడుకల సందర్భంగా కంకణం ధరించే విషయంలో వివాదం తలెత్తి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, దసరా జరుపుకునేలా చేశారు. ఇరువర్గాలకు చెందినవారు ఒకరిమీద మరొకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా మండలంలోని రాగిబావి, అనాజిపురం, దాచారం గ్రామాల్లోనూ దసరా వేడుకల సందర్భంగా స్వల్ప ఘర్షణలు జరిగాయి. రాగిబావి గ్రామంలో డప్పులు కొట్టే వారి మధ్య వివాదం తలెత్తి డప్పులు కొట్టలేదని స్థానికులు తెలిపారు. డప్పుచప్పుడు లేకుండానే దసరా వేడుకలు జరుపుకున్నారు. మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామంలో తన ఇంటిపై దాడి చేసి, తనను, తనభార్యాపిల్లలను దూషించిన బుషిపాక యాదగిరిపై చర్య తీసుకోవాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన వెల్మినేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.  

Updated Date - 2021-10-17T05:11:17+05:30 IST