ప్రయాణికులకు ఎయిరిండియా, ఇండిగో కీలక సూచన!

ABN , First Publish Date - 2020-10-18T14:08:39+05:30 IST

సందర్శన, పర్యాటక వీసాలపై యూఏఈకి వెళ్లేవారికి కన్ఫార్మ్ రిటర్న్ టికెట్ తప్పనిసరి అని ఎయిరిండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సూచించాయి.

ప్రయాణికులకు ఎయిరిండియా, ఇండిగో కీలక సూచన!

అబుధాబి: సందర్శన, పర్యాటక వీసాలపై యూఏఈకి వెళ్లేవారికి కన్ఫార్మ్ రిటర్న్ టికెట్ తప్పనిసరి అని ఎయిరిండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సూచించాయి. కరోనా నేపథ్యంలో యూఏఈ తాజాగా ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనను ఈ సందర్భంగా భారతీయ ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు గుర్తు చేశాయి. "రిటర్న్ టికెట్ లేకుండా సందర్శన, పర్యాటక వీసాలపై ఎమిరేట్‌కు వచ్చే ప్రయాణీకులకు ప్రవేశానికి అనుమతి ఉండదు. సందర్శన లేదా పర్యాటక వీసాపై భారతదేశం నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులందరికీ చెల్లుబాటు అయ్యే రిటర్న్ టికెట్ ఉండడం తప్పనిసరి" అని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో పేర్కొంది. 


వాలీడ్ రిటర్న్ టికెట్ లేకుండా ప్రయాణించే వారికి దుబాయ్‌లోకి ప్రవేశం నిరాకరిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులను హెచ్చరించింది. ఒకవేళ రిటర్న్ టికెట్ లేకుండా వెళ్లి ప్రయాణికులు దుబాయ్‌లో చిక్కుకుంటే వారి సొంత ఖర్చులతో స్వదేశానికి రావాల్సి ఉంటుందని, దీనికి విమానయాన సంస్థతో ఎలాంటి సంబంధం లేదని ఇండిగో తెలిపింది. ఇటీవల భారత్, పాకిస్థాన్‌కు చెందిన చాలా మంది ప్రయాణికులు రిటర్న్ టికెట్ లేకుండా వెళ్లడంతో దుబాయ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 678 మంది పాక్ పౌరులకు యూఏఈలో ప్రవేశం నిరాకరించబడిందని దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ పేర్కొంది. అలాగే గురువారం కూడా సుమారు 140 మంది భారత ప్రయాణికులను దుబాయ్ అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించారు.  

Updated Date - 2020-10-18T14:08:39+05:30 IST