Abn logo
May 29 2020 @ 00:00AM

ఆ సామర్థ్యాన్ని పెంచుకుందాం!

‘‘నా ఉద్యోగం ఉంటుందా? నా వ్యాపారం నడుస్తుందా? - ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే ప్రశ్న. అవును! అందరిలోనూ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన కనిపిస్తోంది. అయితే మనం మనుషులం. బతకడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటాం. కానీ అది అంత సులువు కాదు. అలాగనీ చాలా కష్టం కూడా కాదు. ఇదివరకు ఉన్నట్టే భౌతిక సౌకర్యాలు ఉండాలనీ, ఏదో భిన్నంగా చెయ్యాలనీ మీరు అనుకుంటే బాధే! దేనికైనా సర్దుకొని, మిమ్మల్ని మీరు మలచుకోగలిగినవారైతే, అంత కష్టపడనక్కర్లేదు. 


ప్రస్తుతం దేశంలో చాలాచోట్ల లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చారు. సడలింపులు ఇచ్చారంటే, మనం భౌతిక దూరం పాటించనక్కరలేదని అర్థం కాదు. ఆ సంగతి గుర్తుంచుకొని మెలగాలి. మన అందరి మీదా లాక్‌డౌన్‌ ప్రభావం ఎంతో కొంత ఉంది. దాన్ని మనం ఆపలేం. కానీ కొందరు ముందే బాధపడిపోతూ ఉంటారు. అది వారి హక్కు అనుకుంటారు. నిజమే! మీకు బాధపడే హక్కుంది. మరణించడానికి కూడా హక్కుంది. కానీ మీరు వివేకం ఉన్న మనుషులు కదా! జీవితానికి విలువ ఇచ్చేవారు ఇలాంటి హక్కులను వినియోగించుకోరు. మీరు వినియోగించుకోవాల్సిన ఇతర హక్కులు చాలా ఉన్నాయి. 


రాబోయే రోజుల్లో, కొంతమంది ప్రజలు పస్తులు ఉండే అవకాశం ఉంది. ఒక సమాజంగా, మనమందరం ముందుకు వచ్చి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రజలు బయట అడుగుపెట్టాలంటే భయంలో ఉన్నప్పుడు, వారికి ఇన్ఫెక్షన్‌ ఉందేమో అన్న భావనతో, ఒకరి పట్ల మరొకరు వివక్ష చూపుతున్నప్పుడు - ఎంతో మంది నర్సులు, డాక్టర్లు, పోలీసులు, అలాగే వాలంటీర్లు కూడా సాహసంగా ముందుకు వచ్చారు. అంటే వాళ్ళందరూ ‘యోగస్థః కురు కర్మాణి’ అనే సిద్ధాంతాన్ని పాటించడం వల్లే!

‘యోగస్థః కురు కర్మాణి’ అని కృష్ణుడు చెప్పాడు. అంటే మొదట యోగంలో స్థిరపడి, ఆ తర్వాత పనులు చేయాలని! అంటే, యోగాసనంలో ఉండి ఆ తర్వాత పని చేయడం మొదలు పెట్టాలా? కాదు. మనం మాట్లాడుతున్నది ‘యోగా’ గురించి... ‘యోగాసనం’ గురించి కాదు. మిమ్మల్ని మీరు ‘యోగాలో స్థిరపరచుకోవడం’ అంటే, మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎంతో కొంత ఏకత్వ భావనతో ఉండడం. ‘యోగ’ అంటే ఏకత్వం. ‘నేను’ అని మీరు దేనినైతే అనుకుంటున్నారో, దాని సరిహద్దులు కొద్దిగా చెరిపెయ్యాలి. అప్పుడు మీదైన చిన్న స్థాయిలో మీరు ఒక యోగి. అప్పుడు మీరు ఆ క్షణంలో ఎలా అవసరమైతే అలా పని చేస్తారు.మనం ‘యోగా’లో స్థిరపడి ఉంటే, పరిస్థితులు ఎలా వచ్చినా సరే, మనం చేయగలిగే ఉత్తమమైన పనేదో అది చేస్తాం. ప్రస్తుతం మనం చేస్తున్నది కూడా ఇదే! ఇదేమీ అనుకూలమైన పరిస్థితి కాదు. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లోంచీ అడుగు బయటపెట్టలేని వారికి పని చెయ్యడానికి వెళ్ళాలనిపిస్తోంది.  జీవితంలో ఎప్పుడూ అలా అనిపించలేదు. ఇలాంటి మార్పులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనల్ని మనం చక్కగా ఉంచుకోవాలి. భౌతికంగా, మానసికంగా, భావపరంగా, శక్తిపరంగా, సామర్థ్యపరంగా మెరుగుపడాలి. దీని కోసం ఆన్‌లైన్‌లో ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేస్తే, మీ మనోభావాల క్రమం మారిపోతుంది. ఆ ప్రోగ్రామ్‌లో పది శాతం అర్థమైనా, మీ సమతుల్యతలో పదిశాతం మెరుగుదల కనిపిస్తుంది. 

ఈ భూమి మీద ప్రతి మానవుడూ రాబోయే కొద్ది రోజుల్లో ఒక పది శాతం తనను తాను మెరుగుపరచుకున్నా, ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది! కనీసం పది శాతం సమస్యలైనా దూరం అవుతాయి. దాని కోసం ప్రయత్నిద్దాం.

-సద్గురు జగ్గీవాసుదేవ్


Advertisement
Advertisement
Advertisement