ఫిర్యాదుల స్వీకరణకే సదస్సులు!

ABN , First Publish Date - 2022-07-07T09:07:00+05:30 IST

పట్టాదారు పేరు నమోదులో తప్పిదం నుంచి విస్తీర్ణంలో తేడా దాకా.. పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం నుంచి విక్రయించిన భూమిని వారసులకు పట్టా చేయడం దాకా..

ఫిర్యాదుల స్వీకరణకే సదస్సులు!

  • భూ సమస్యలకు ధరణిలో దొరకని పరిష్కారం
  • కలెక్టర్ల లాగిన్‌లో 2 లక్షల ఫిర్యాదులు పెండింగ్‌
  • కలెక్టర్లు లేకుండానే రెవెన్యూ సదస్సులు
  • సమస్యల పరిష్కారంపై రైతుల్లో సందేహాలు
  • భూ రికార్డుల ప్రక్షాళన నుంచి ఆన్‌లైన్‌లో 
  • వివరాలు నమోదు చేసేదాకా పొరపాట్లు
  • దరఖాస్తుల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం!

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పట్టాదారు పేరు నమోదులో తప్పిదం నుంచి విస్తీర్ణంలో తేడా దాకా.. పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం నుంచి విక్రయించిన భూమిని వారసులకు పట్టా చేయడం దాకా.. సాదాబైనామాతో భూమిని అనుభవిస్తున్నా ఆన్‌లైన్‌లో పేరు నమోదు కాకపోవడం నుంచి.. గ్రామంలోని భూమి మొత్తం ఒకే వ్యక్తి పేరిట నమోదయ్యే దాకా.. ఇలా ఎన్నెన్నో సమస్యలు ధరణి పోర్టల్‌ కారణంగా తలెత్తుతున్నాయి. కొన్ని లక్షల మంది రైతులు ఈ సమస్యలపై ఫిర్యాదు చేశారు. అవన్నీ ఆయా జిల్లాల కలెక్టర్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ధరణిలో ఇప్పటిదాకా ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. వీటన్నింటినీ పెండింగ్‌లోనే ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ సదస్సులు భూ సమస్యల పరిష్కారం కోసం కాకుండా మరిన్ని ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమవుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ లాగిన్‌లో ఉన్న సమస్యలను కలెక్టర్లే పరిష్కరించాల్సి ఉండగా.. రెవెన్యూ సదస్సులకు వారే హాజరు కాకపోతుండడం ఈ సందేహాలకు కారణం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం  అవకాశం కల్పించకుండా.. సదస్సులు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని అంటున్నారు. జూన్‌ 14న సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, శేషాద్రి,  సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ భూషణ్‌తో కలిసి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా ఆ మండలంలో 280 ఫిర్యాదులు వచ్చాయి. కానీ, వీటిలో చాలా సమస్యలకు ధరణిలో ఆప్షన్లు లేకపోవడంతో పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. 


రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే..

పట్టాదారు పేరు నమోదులో దొర్లిన తప్పిదాలను మార్చే అవకాశం లేదు. సర్వే నంబర్‌ విస్తీర్ణంలో ఆర్‌ఎ్‌సఆర్‌కు మించిన లేదా ఆర్‌ఎ్‌సఆర్‌కు తక్కువ భూమి నమోదైంది. దీనిని సరిచేసే ఆప్షన్‌ లేదు.

మిస్సింగ్‌ సర్వే నంబరుపై ఖాతా నంబర్‌ ఉన్న రైతులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఖాతా నంబర్‌ లేనివారు మిస్సింగ్‌ సర్వే నంబర్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదు. 

ఒక సర్వే నంబరులో నుంచి కాల్వలు, ప్రాజెక్టులు,  రహదారుల నిర్మాణాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న భూమితోపాటు ఆ సర్వే నంబరులో ఉన్న భూమి మొత్తాన్ని నిషేదిత జాబితాలో చేర్చారు. దీనిని సవరించేందుకు ఽచాన్స్‌ లేదు. 

అసైన్డు భూమి పొందిన రైతు మరణిస్తే, ఆ భూమిని అతడి వారసులకు మార్పిడి చేసేందుకు వీలు లేదు.

ఇనాం సర్టిఫికెట్లు పొందేందుకు, గతంలో పొందిన సర్టిఫికెట్లకు ధరణిలో అవకాశం లేదు. 

సాదాబైనామా కింద కొనుగోలు చేసిన వ్యక్తులు భూమిని అనుభవిస్తున్నా.. ఆన్‌లైన్‌లో వారిపేర్లు నమోదు కాలేదు. దీని కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆప్షన్‌ లేదు. వీటికి సంబంధించి  8.13 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, భూదాన్‌, రిజర్వు ఫారెస్ట్‌ జాబితాలో పట్టా భూములు నమోదై ఉన్నాయి. వీటిని సవరించేందుకు అవకాశం లేదు.ఈ  సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. 


కలెక్టర్ల లాగిన్‌లో పెద్దసంఖ్యలో దరఖాస్తులు

ధరణి ద్వారా వస్తున్న దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్‌లో కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో వీటి సంఖ్య పెరిగిపోతోంది. భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ వివరాలను ఆన్‌లైన్‌ చేసే సమయంలో పెద్దఎత్తున పొరపాట్లు జరిగాయి. వీటి సవరణకు డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌కు మంచి డిమాండ్‌ ఉన్న జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉందంటున్నారు. ఇక, సిబ్బంది కొరత కూడా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆటంకంగా మారిందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు 


గ్రామం మొత్తం ఒక్కరి పేరుపైనే.. 

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గ్రామం మొత్తం ఒకే ఒక్క పట్టేదార్‌ పేరిట నమోదైనట్లు ధరణిలో చూపిస్తోంది. మరోవైపు మహబాబుబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్‌ రెవెన్యూ గ్రామంలో 1403 ఎకరాల పట్టాభూమి.. అటవీశాఖ పేరిట నమోదై ఉంది. దీంతో దాదాపు 1200 మంది రైతులు రైతుబంధు, రైతుబీమాకు దూరమయ్యారు. కారణాలు లేకుండనే పట్టా భూములను అసైన్డ్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌బోర్డు, భూదాన్‌ భూముల జాబితాలో చేర్చారు. కోర్టు ఆర్డర్‌ కొంత భూమికే ఉంటే, ఆ సర్వే నెంబరులోని మొత్తం విస్తీర్ణానికి ఎఫెక్ట్‌ అయ్యేలా ధరణిలో నమోదు చేశారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 2.70 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా.

Updated Date - 2022-07-07T09:07:00+05:30 IST