ఇంటింటి ఆరోగ్యసర్వే నిర్వహించండి

ABN , First Publish Date - 2022-01-21T07:03:28+05:30 IST

జిల్లాలోని గ్రామ, పట్టణ కేంద్రాల్లో శుక్రవారం నుండి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

ఇంటింటి ఆరోగ్యసర్వే నిర్వహించండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

పిల్లల టీకాలు వంద శాతం చేయాలి

పనిచేసే చోటే వర్కర్లకు బూస్టర్‌ డోస్‌

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 20 : జిల్లాలోని గ్రామ, పట్టణ కేంద్రాల్లో శుక్రవారం నుండి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా గురువారం అధికారులతో సమీక్షించారు. సర్వేలో జ్వరంతో బాధపడుతూ కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌ కిట్లు అందించాలని అన్నారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్నారు. అధికారుల సమన్వయంతో సర్వే జరిపి రెండో డోస్‌, బూస్టర్‌ డోస్‌ వేసుకునేలా చూడాలన్నారు. రెండో డోస్‌, పిల్లల టీకా వందశాతం పూర్తికి కృషి చేయాల న్నారు. ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులకు బెడ్లు, చికిత్స కోసం ఆక్సిజన్‌ అందుబాటు లో ఉంచాలన్నారు. అవసరమున్న ఆక్సిజన్‌, కొవిడ్‌ మందులు సిద్ధం చేసుకోవాల న్నారు. ప్రతీరోజు 25 ఇళ్లలో సర్వే నిర్వహించి రిపోర్ట్‌ పంపాలన్నారు. మండలాల వారీగా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్లు బోర్కడే, రాంబాబు, వైద్యాధికారి ధనరాజ్‌తో పాటు ఇతర అధికారులు సమావేశానికి హజరయ్యారు. 

టీకాపై అవగాహన వాహనం ప్రారంభం

కొవిడ్‌ టీకాపై అవగాహన కల్పించేందుకు గాను ఏర్పాటు చేసిన వాహనాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలందరూ టీకా వేసుకునేందుకు ఈ వాహనం ఉపయోగ పడాలన్నారు. వరల్డ్‌ విజన్‌ ఇండియా, యూనిసెఫ్‌ సంయుక్తంగా ఈ వాహనం ఏర్పాటు చేసింది. జిల్లా వైద్యాధికారి ధనరాజ్‌, వరల్డ్‌ విజన్‌ మేనేజర్‌ బ్రహ్మన్న, డీపీఆర్‌వో ఉమారాణి, కోఆర్డినేటర్‌ ఎం. విశ్వాస్‌ పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిర్మల్‌లోని చైన్‌ గేట్‌ నుండి బంగల్‌పేట్‌ వినాయక్‌సాగర్‌ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ గురువారం పరిశీలించారు. రోడ్డు వెడల్పుతో సమస్యలు పరిష్కారమవుతాయని, నాణ్యతగా నిర్మించాలని కలెక్టర్‌ సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు. 

డంపింగ్‌యార్డ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిర్మల్‌ రూరల్‌, జనవరి 20 : నిర్మల్‌ పట్టణం బంగల్‌పేట్‌లో గల డంపింగ్‌ యార్డ్‌ను జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే దినసరి వేతనంపై ఎక్కువ మంది కూలీలను నియమించాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ డంపింగ్‌ యార్డ్‌ మొత్తం పర్యవేక్షించి, ఎంత కంపోస్ట్‌ ఎరువు తయారు అవుతుంది తదితర వివరాలను మున్సిపల్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మల్‌ పట్టణ కేంద్రంలో గల స్మశాన వాటిక పనులను పురోగతిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే. మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ జాదవ్‌ మురహరి, ఇంజనీర్‌ అజార్‌, హెల్త్‌ అసిస్టెంట్లు హజరయ్యారు. 

గణతంత్య్ర వేడుకలు పకడ్బందీగా జరపాలి : అదనపు కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 20 : జనవరి 26న గణతంత్య్ర దిన వేడుకలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. వేడుకలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. అధికారులు హాజరయ్యారు. 

Updated Date - 2022-01-21T07:03:28+05:30 IST