రూ.89 కోట్లు.. ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-07-24T05:01:40+05:30 IST

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఒక్కో యూనిట్‌కు కేంద్రం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేల చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకాన్ని పక్కన పెట్టేసింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా 37,778 గృహాలకు సంబంధించి రూ.89.49 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

రూ.89 కోట్లు.. ఎప్పుడిస్తారు?
డొంకూరులో పునాదిలోనే ఎన్టీఆర్‌ గృహాలు

ఎన్టీఆర్‌ గృహనిర్మాణాల బిల్లులందక అవస్థలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు
వైసీపీ వచ్చాక బిల్లులు నిలిపేసిన వైనం
ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన గోపబంధ్‌ బెహరా కొన్నేళ్ల కిందట ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో అప్పు చేసి ఇల్లు నిర్మాణం పూర్తిచేశాడు. గత ప్రభుత్వ హయాంలో రెండు బిల్లులు రూ.లక్ష ఖాతాలో పడ్డాయి. తర్వాత అప్‌లోడ్‌ చేసిన బిల్లులకు డబ్బులు అందలేదు. చేసిన అప్పులు.. వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి.

  ఇచ్ఛాపురం మండలం డొంకూరుకు చెందిన చీకటి మీనాకు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు. ఇల్లు శ్లాబ్‌ పనులు పూర్తిచేయగా.. బేస్‌మట్టం బిల్లు రూ.19వేలు మాత్రమే అందజేశారు. బిల్లుల కోసం అడిగితే.. అధికారులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.  

ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మీపురానికి చెందిన పిట్ట తాతయ్యకు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఈయనకు కొన్నేళ్ల కిందట ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం పూర్తికాగా.. రూ.19వేలు మాత్రమే ప్రభుత్వం అందజేసింది. మూడేళ్లుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు.

..ఇలా ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఒక్కో యూనిట్‌కు కేంద్రం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేల చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. జిల్లావ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులు సొంతింటి కల నెరవేరనుందని ఆనందపడ్డారు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకాన్ని పక్కన పెట్టేసింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా 37,778 గృహాలకు సంబంధించి రూ.89.49 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు మంజూరు కాక.. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ డీఈ రామకృష్ణ వద్ద ప్రస్తావించగా.. బిల్లుల బకాయిలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. బిల్లుల మంజూరు విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని వివరించారు. 

Updated Date - 2022-07-24T05:01:40+05:30 IST