మురుగునీరు పారక ప్రజల అవస్థలు

ABN , First Publish Date - 2022-06-27T06:14:02+05:30 IST

మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లుకు సైడు కాలువలు లేకపోవడంతో అంతర్గత రోడ్లన్నీ మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి.

మురుగునీరు పారక  ప్రజల అవస్థలు
సైడుకాలువలు లేక రోడ్డుపై నిలిచిన నీరు

త్రిపురాంతకం, జూన్‌ 26: మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లుకు సైడు కాలువలు లేకపోవడంతో అంతర్గత రోడ్లన్నీ మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో నడిచేందుకు పాదచారులకూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైనేజీలు అన్ని ప్రాంతాల్లోనూ, పూర్తిగా చెత్తాచెదారంతో పూడిపోయి మురికి నీరు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీరు, ఆవాసాల్లోని మురికి నీరు మొత్తం డ్రైనేజీల నుంచి పలు ప్రాంతాలలో పైకి వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండేళ్ల క్రితం పెద్దమొత్తంలో నిధు లు ఖర్చుచేసి సైడు కాలువల్లోని పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించినా ప్రస్తుతం మళ్లీ అవి పేరుకుపోయాయి. దీనికి తోడు గ్రామంలోని బ్రహ్మంగారికాలనీ, ఉత్తరపు బజారు, ఉప్పలగుట్ట వంటి ప్రాంతాల్లో అనేక వీధులకు సీసీరోడ్లు లేవు. పలుచోట్ల సుమారు 20 ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతిని పాడయ్యాయి. ఏ ఒక్క వీధిలోనూ, సైడు కాలువలు లేవు. చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలిచి రోడ్లన్ని చెరువులను, కుంటలను తలపిస్తున్నాయి. అంబేడ్కర్‌ కాలనీలో సైడుకాలువల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో రోడ్లు బురద మయంగా మారుతున్నాయి. పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు వస్తున్న నేపథ్యంలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.  అధికారులు స్పందించి గ్రామంలోని అన్ని వీధులకు సైడు కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజి వ్యవస్ధను మెరుగుపరచాలని కోరుతున్నారు.

Updated Date - 2022-06-27T06:14:02+05:30 IST