దుకాణదారులు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-05-21T10:45:40+05:30 IST

జమ్మలమడుగులో గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రకాల షాపులు మూసివేశారని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దుకాణాలను

దుకాణదారులు నిబంధనలు పాటించాలి

జమ్మలమడుగు రూరల్‌, మే 20: జమ్మలమడుగులో గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రకాల షాపులు మూసివేశారని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దుకాణాలను తెరిచేందుకు చర్యలు ప్రారంభించామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. బుధవారం జమ్మలమడుగు అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో హోటళ్ల యజమానులు, దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. దుకాణాల్లో భౌతిక దూరం పాటించాలని తెలిపారు. హోటళ్ల యజమానులు కేవలం పార్శిల్‌ మాత్రమే విక్రయించాలన్నారు. బంగారు, వస్త్ర, ఇతర వ్యాపారులు దుకాణాల ఎదుట శానిటైజర్‌, నీళ్లు, తదితరవన్నీ ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరిని దుకాణంలోకి అనుమతించాలన్నారు. గుంపులుగా చేరరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవన్నారు. గురువారం ఉదయం నుంచి వ్యాపారులు షాపులను తెరచుకోవాలని సూచించారు.  


ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు  

జమ్మలమడుగు పెన్నానది పరిసర ప్రాం తాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. బుధవారం  స్థానిక అర్బన్‌ పోలీసు స్టేషన్‌ కార్యాలయంలో ఎక్సైజ్‌ సీఐ చెన్నారెడ్డి, అర్బన్‌ సీఐ మధుసూదన్‌రావు, ఆశాఖకు సంబందించిన ఎస్‌ఐలతో డీఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జమ్మలమడుగు ప్రాంతంలో ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవన్నారు. కొండాపురంలో ఇసుక రీచ్‌ ఉందని.. ఇసుక కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జమ్మలమడుగు, మైలవరం తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఐలు రంగారావు, రవికుమార్‌, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-21T10:45:40+05:30 IST