కండీషన్‌ బస్సును నడపాలి

ABN , First Publish Date - 2022-05-18T05:28:47+05:30 IST

మండలంలోని ఎగువ సిద్దవరం గ్రామానికి నడుస్తోన్న 4107 నెంబరు గల ఆర్టీసీ బస్సును రద్దు చేసి దాని స్థానంలో కండీషన్‌ బస్సును నడపాలని ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. రాజంపేట ఆర్టీసీ డిపో నుంచి వచ్చే ఈ బస్సుకు బ్రేకులు కూడా సరిగ్గా పనిచేయవని, ఇటీవల ఓసారి బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారని ఆరోపిస్తున్నారు.

కండీషన్‌ బస్సును నడపాలి
ఎగువ సిద్దవరం గ్రామానికి నడుస్తున్న బస్సు ఇదే

డొక్కు బస్సుతో వేగలేకున్నాం

ఎగువ సిద్దవరం గ్రామ ప్రజలు, విద్యార్థులు

పెనగలూరు, మే 17: మండలంలోని ఎగువ సిద్దవరం గ్రామానికి నడుస్తోన్న 4107 నెంబరు గల ఆర్టీసీ బస్సును రద్దు చేసి దాని స్థానంలో కండీషన్‌ బస్సును నడపాలని ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. రాజంపేట ఆర్టీసీ డిపో నుంచి వచ్చే ఈ బస్సుకు బ్రేకులు కూడా సరిగ్గా పనిచేయవని, ఇటీవల ఓసారి బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారని  ఆరోపిస్తున్నారు. బస్సు బాగా డొక్కుగా మారడంతో కిటికీల అద్దాల నుంచి వచ్చే శబ్దంతో చెవులకు తూట్లు పడుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. తమ స్టేజీ వద్ద ఆపాలని కండక్టర్‌కు చెప్పినా బస్సు శబ్దంతో వినపడకపోవడం వల్ల ఒకచోట దిగాల్సింది పోయి మరో చోట దిగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సును మార్చమని ఎన్నిసార్లు ఆర్టీసీ యాజమాన్యానికి తెలిపినా పట్టీపట్టనట్లుగా ఉంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు.

బస్సును మార్చమని కోరినా స్పందన లేదు

విద్యార్థుల రాకపోకలకు ఉపయోగపడే బస్సు కండీషన్‌తో ఉండాలని, ఈ డొక్కు బస్సును మార్చాలని పలుమార్లు డిపో సిబ్బందికి తెలిపినా స్పందన లేదు. ఇప్పటికైనా విద్యార్థుల మనోభావాలని రాజంపేట డిపో సిబ్బంది గుర్తించాలి. 

- శివశంకర్‌రెడ్డి, విద్యార్థి, పెనగలూరు


గట్టిగా అరవాల్సి వస్తోంది 

టికెట్‌ తీసుకోవాలన్నా, స్టేజీ వద్ద దిగాలన్నా కండక్టర్‌కు చెప్పాలంటే బస్సు శబ్ధంతో గట్టిగా అరవాల్సి వస్తోంది. బస్సు అద్దాలన్నీ ఊగిపోతూ విపరీతమైన శబ్దం వస్తోంది. కనీసం ఫోన్‌ మాట్లాడాలన్నా ఇబ్బందే. 

- కుమార్‌, ప్రయాణికుడు


ఇటువంటి బస్సు నడిపితే ఎలా ?

రాజంపేట నుంచి ఇండ్లూరు వరకు రోడ్డు బాగానే ఉన్నా అక్కడి నుంచి వయా ఎన్‌.సిద్దవరం, తిరుమలరాజు మీదుగా ఎగువ సిద్దవరం వరకు 2.5 కి.మీ రోడ్డు దయనీయంగా ఉంది. అలాంటి రోడ్డుపై డొక్కు బస్సును నడిపితే ఎలా. 

-బి.నరసింహులు యాదవ్‌(శర్మ), సిద్దవరం 

Updated Date - 2022-05-18T05:28:47+05:30 IST