ముగిసిన భారత్‌-చైనా చర్చలు

ABN , First Publish Date - 2020-06-07T13:11:06+05:30 IST

సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం కోసం నియంత్రణ రేఖ వద్ద భారత్‌, చైనా చర్చలు ముగిశాయి.

ముగిసిన భారత్‌-చైనా చర్చలు

ఐదుగంటల పాటు సాగిన సమావేశం

న్యూఢిల్లీ/బీజింగ్‌/వాషింగ్టన్‌, జూన్‌ 6: సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం కోసం నియంత్రణ రేఖ వద్ద భారత్‌, చైనా చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం 11.30గంటలకు మొదలైన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సమావేశం, 5 గంటల పాటు సాగినట్లు తెలుస్తోంది. దౌత్య, సైనికపరమైన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని భారత సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. నిరాధారమైన, ఊహాగానాల్ని వ్యాప్తి చేయవద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని నియంత్రణ రేఖకు చైనా వైపున ఉన్న మాల్డా ప్రాంతంలో చర్చలు జరిగాయి. భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా తరఫున టిబెట్‌ మిలిటరీ జిల్లా కమాండర్‌ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఇప్పటికే 12 సార్లు స్థానిక కమాండర్ల స్థాయిలో, 3సార్లు మేజర్‌ జనరల్‌ స్థాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.


కాగా.. సరిహద్దుల్లో చిన్న ముక్కను కూడా తమ దేశం వదులు కోదని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ స్పష్టం చేసింది. చైనాతో శత్రుత్వం పెట్టుకోవద్దంటూ సంపాదకీయంలో హెచ్చరించింది. చైనాతో పెట్టుకుంటే మొత్తం హిమాలయాల ప్రాంతం, భారత ఉపఖండం అస్థిరతకు లోనవ్వడం ఖాయమని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. మరోవైపు నియంత్రణ రేఖ వద్ద శాంతియుత పరిస్థితులకై భారత్‌ చేస్తున్న కృషి పట్ల చైనాకు ఏమాత్రం గౌరవం లేదంటున్నారు నిపుణులు. అమెరికాకు చెందిన దక్షిణాసియా వ్యవహారాల పరిశీలకులు ఆష్లే టెల్లిస్‌ తన పరిశోధనా పత్రాల్లో ఈ వ్యాఖ్య చేశారు. ఇక.. చైనాకు వ్యతిరేకంగా 8 దేశాల చట్టసభల సభ్యులతో కొత్త కూటమి ఏర్పాటైంది. ఇందులో అమెరికా, జర్మనీ, యూకే, జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌, నార్వే దేశాల సభ్యులున్నారు.

Updated Date - 2020-06-07T13:11:06+05:30 IST